‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌! | The Lion King Telugu Movie Review | Sakshi
Sakshi News home page

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

Published Fri, Jul 19 2019 8:13 AM | Last Updated on Tue, Apr 14 2020 11:40 AM

The Lion King Telugu Movie Review - Sakshi

హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పుడు తెలుగు మార్కెట్‌ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఏదో మొక్కుబడిగా సినిమాలు తెలుగులో రిలీజ్ చేయటం కాదు ఆ సినిమాకు తెలుగు టాప్‌ స్టార్స్‌తో డబ్బింగ్ చెప్పించి సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అదే బాటలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ విజువల్ వండర్ ‘ది లయన్‌ కింగ్’.

కథ విషయానికి ది లయన్‌ కింగ్ భారతీయులకు బాగా పరిచయం ఉన్న కథే. ఈ సినిమా కథకు ఇండియాస్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ బాహుబలి కథకు చాలా దగ్గర పోలికలున్నాయి. అడవికి రారాజు ముఫాసా.. తన తరువాత తన కొడుకును సింబాను రాజును చేయాలనుకుంటాడు. కానీ ముఫాసా తమ్ముడు స్కార్‌కు ఇది నచ్చదు. అందుకే కుట్ర పన్ని ముఫాసాను చంపేస్తాడు. అంతేకాదు ముఫాసా చావుకు సింబానే కారణం అని అందరినీ నమ్మించి చిన్న వయసులోనే సింబాను ఆ అడవికి దూరం చేస్తాడు. ముఫాసా భార్య సరభిని ఇబ్బందుల పాలు చేస్తాడు.

రాజ్యాధికారం తీసుకున్న స్కార్‌ తన అరాచక పాలన కొనసాగిస్తుంటాడు. స్కార్ చర్యల కారణంగా అడవితో పాటు జంతువులు కూడా అంతరించిపోతుంటాయి. అడవి వదిలి వెళ్లిన సింబాను పుంబా, టిమెన్‌ అనే రెండు జంతువులు పెంచి పెద్ద చేస్తాయి. పెద్దవాడైన సింబా.. నల అనే ఆడ సింహాం ద్వారా స్కార్ చేస్తున్న అరాచాకాలు, తన తల్లిని పడుతున్న కష్టాలను తెలుసుకుంటాడు. రాజ్యాన్ని, తల్లిని కాపాడుకునేందుకు సింబా ఏంచేశాడు? తిరిగి అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు..? స్కార్‌ ఆట ఎలా కట్టించాడు? అన్నదే మిగతా కథ.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తే డైలాగ్స్‌ కామెడీగా ఉంటాయి. కానీ ది లయన్‌ కింగ్ చూస్తే మనకు అలాంటి ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ, రవిశంకర్‌లు చెప్పిన డబ్బింగ్‌ మనకు మన సినిమానే చూస్తున్న ఫీలింగ్‌ కలిగిస్తాయి. ఫొటో రియలిస్టిక్‌ టెక్నాలజీతో దాదాపు 1700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళుతుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌మాత్రమే కాదు పరిసరాలు, చెట్లు, వాగులు, చిన్న చిన్న పురుగులు లాంటివాటి విషయంలో కూడా దర్శకుడు తీసుకున్న కేర్‌ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది.

కేవలం సాంకేతికతను నమ్ముకొని గ్రాండ్‌ విజువల్స్ క్రియేట్ చేయటమే కాదు అందుకు తగ్గ కథా కథనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు జాన్‌ ఫెవ్‌రూ. ఓ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన డ్రామా, ఎమోషన్స్, కామెడీ మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ది లయన్‌ కింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనటంతో సందేహం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. కథపరంగా మనకు పెద్దగా కొత్తగా అనిపించకపోయినా గ్రాండ్ విజువల్స్‌, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, మ్యూజిక్‌, సినిమాటోగ్రఫి ఇలా అన్ని కలిసి ది లయన్‌ కింగ్‌ను ఓ విజువల్‌ వండర్‌గా మార్చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement