అలీ, జగపతిబాబు, నాని, రవిశంకర్
‘‘నా గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పినవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ, ఇప్పుడు నా గొంతు డిస్నీ సినిమాకు డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. జాన్ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’. డిస్నీ వరల్డ్ స్టుడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ముఫాసా, స్కార్, సింబా, నల, పుంబా, టిమోన్ పాత్రలకు తెలుగులో రవిశంకర్, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం.
ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్ చెప్పాలి. ఈ యానిమేషన్ చిత్రంలోనూ విలన్‌కు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది’’ అన్నారు. నాని మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది చేస్తున్న సినిమాలన్నీ నా కోసం, ప్రేక్షకుల కోసం. ‘ది లయన్ కింగ్’కి నా కొడుకు జున్ను కోసం (నాని కుమారుడు అర్జున్) డబ్బింగ్ చెప్పాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వుకునేవాణ్ని. భావోద్వేగభరితమైన కథతో రూపొందిన ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘డిస్నీవారు తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్ చెప్పడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు అలీ.
Comments
Please login to add a commentAdd a comment