శివ పెద్ద దర్శకుడు కావాలి | Maa Aai Productions First Film In Shivakumar Direction Titled 22 | Sakshi
Sakshi News home page

శివ పెద్ద దర్శకుడు కావాలి

Published Sun, Jun 23 2019 6:05 AM | Last Updated on Sun, Jun 23 2019 6:05 AM

Maa Aai Productions First Film In Shivakumar Direction Titled 22 - Sakshi

కొండా కృష్ణంరాజు, రూపేశ్, శివ, వినాయక్, సలోని, సి. కల్యాణ్‌

మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శివకుమార్‌ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22.’. రూపేశ్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్‌ లోగో ఆవిష్కరణ, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం శనివారం జరిగింది. లోగోను సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, టైటిల్‌ను వీవీ వినాయక్‌ ఎనౌన్స్‌ చేశారు. వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్నవాడు. బీఏ రాజుగారి ద్వారా శివకు ఈ సినిమా చాన్స్‌ వచ్చింది అనుకుంటారు అందరూ. కానీ తానే సొంతంగా దర్శకునిగా అవకాశం దక్కించు కున్నాడు.

ఈ సినిమా టైటిల్‌ ‘22’. ఈ రోజు జూన్‌ 22. వచ్చే నెల 22న రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభమవుతుంది. శివ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వెబ్‌ సిరీస్‌తో తన టాలెంట్‌ను ఫ్రూవ్‌ చేసుకొని సినిమా చాన్స్‌ దక్కించుకోవటం సామాన్యమైన విషయం కాదు. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ట్రెండ్‌ మార్క్‌ అయ్యిందో అలా శివకు ‘22’ ట్రెండ్‌ మార్క్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు మారుతి. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘జయగారు ఎక్కడున్నా సంతోషిస్తారు. శివ దర్శకుడు అవ్వాలని బలంగా ఆమె కోరుకునేది. తక్కువ టైమ్‌లో శివ దర్శకునిగా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

శివ మాట్లాడుతూ– ‘‘మారుతి, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్‌ గార్ల దగ్గర దర్వకత్వ శాఖలో చేశాను. నేను వెబ్‌ సిరీస్‌ చేసిన ప్రొడక్షన్‌లోనే సినిమా చేసే అవకాశం రావటం హ్యాపీగా ఉంది. దర్శకురాలు బి.జయగారు మా అమ్మ అని అందరికీ తెలుసు. ఆమె దగ్గర ప్రొడక్షన్‌ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. నా స్ట్రగుల్స్‌లో తోడుగా ఉంటూ ప్రతిక్షణం ముందుకు నడిపించారు మా నాన్న బీఏ రాజు’’ అన్నారు. ‘‘డైరెక్టర్‌ శివగారు నాకు వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చారు. మళ్లీ తన సినిమాలో హీరోగా చాన్స్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు రూపేష్‌. ‘‘ఫలక్‌నామా దాస్‌’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సలోని. నిర్మాత కొండా కృష్ణంరాజు, సంగీత దర్శకులు సాయి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement