
సంప్రదాయ నృత్యాన్ని ప్రోత్సహించా
తన కెరీర్ మొత్తమ్మీద ఒకే ఒక ‘ఆజా నచ్‌లే’ అనే నృత్య ఆధారిత సినిమాలోనే నటించినప్పటికీ... అనేక ప్రాజెక్టుల ద్వారా సంప్రదాయ కళలను ప్రోత్సహించినట్టు బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ చెప్పింది. ‘దేడ్ ఇష్కియా’ సినిమాలో కథక్ నృత్యకారిణి పాత్ర పోషించిన మాధురి....కథక్ నిపుణుడు బిర్జూ మహారాజ్ కోరియోగ్రఫీతో కథక్ నృత్యం కూడా చేసింది. ‘ఆజా నచ్‌లే’ తర్వాత నృత్య ప్రధాన సిని మాల్లో నటించకపోయినప్పటికీ సంప్రదాయ నృత్యానికి మొదటినుంచి నిరంతరం నావంతు ప్రోత్సాహమందిస్తూనే ఉన్నా. ‘దేడ్ ఇష్కియా’లో కూడా కథక్ కళాకారిణి పాత్ర పోషించా. ఆ పాత్రకు తగినట్టుగా చక్కగా నాట్యం కూడా చేశా’ అని ఈ 47 ఏళ్ల కళాకారిణి తన మనసులో మాట చెప్పింది.
మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో అడుగిడిన మాధురి ... ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది. ‘పాశ్చాత్య దేశాల ప్రభావం కూడా నాపై ఉంది. ఇక బాలీవుడ్‌లోనూ ఆది నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. అయితే సూపర్‌హిట్ అయిన అన్ని సిని మాలను మీరు గమనించినట్టయితే వాటన్నింటిలోనూ భారతీయత ఉట్టిపడుతుంది’ అని అంది. తాజ్‌మహల్ టీలో కొత్త వెరైటీని ఆవిష్కరించేందుకు మాధురి నగరానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయ నృ త్యం అందరికీ అవగాహన కలిగించేందుకు యువతరం ముందుకు రావాలని పిలుపుని చ్చింది.
సంప్రదాయ విలువలు వారికి మాత్రమే తెలుస్తాయంది. సంప్రదాయ నృత్య టార్చ్‌ను ముందు తరాలకు వారు మాత్రమే అందించగలుగుతారంది. సంప్రదాయ నృత్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది మాధురి.