
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు లేటెస్ట్ చిత్రం ‘మహర్షి’ విడుదల వాయిదా పడిందంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర సన్నిహిత వర్గాల్ని సంప్రదించగా అలాంటిదేం లేదని పేర్కొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే జూన్‌లో విడుదల కానుందంటూ తాజాగా వార్తలు వినిపించాయి.
ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాకపోయినా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కన్ఫార్మ్ అట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో మహేశ్‌తో పాటు ముఖ్య తారాగణమంతా పాల్గొంటారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా కనిపించనున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయు మోహనన్.