అనుకున్నది సాధించే పోలీసాఫీసర్
‘‘మహేశ్‌బాబుతో మేం నిర్మించిన మూడో చిత్రం ఇది. ఓ సూపర్‌స్టార్‌తో ఇలా మూడు సినిమాలు చేసే అవకాశం రావడం మా అదృష్టం’’ అని అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట చెప్పారు. మహేశ్‌బాబు హీరోగా జి. రమేశ్‌బాబు సమర్పణలో శ్రీను వైట్ల దర్శక్వంలో రూపొందిన ‘ఆగడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట బుధవారం హైదరాబాద్‌లో పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదల చేయబోతున్నాం.
తను అనుకున్నది సాధించడానికి ఎవరు ఆపినా ఆగని క్రమశిక్షణ గల పోలీసాఫీసర్ కథ ఇది’’ అన్నారు. ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి, ‘ఆగడు’కి పోలికలున్నాయనే టాక్ ఉంది? అనే ప్రశ్నకు -‘‘ఇందులో మహేశ్ కూడా పోలీసాఫీసర్ కాబట్టి, అలా అనిపిస్తుందేమో. అది మినహా ఆ చిత్రానికి, దీనికీ ఎక్కడా పోలిక ఉండదు. మహేశ్ పాత్ర చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయన చేసిన ఫైట్లు, డాన్సులు.. ఓవరాల్‌గా సినిమా అభిమానులు పండగ చేసుకునేలా ఉంటుంది.
ఈ చిత్రం కోసం బళ్లారిలో కీలక సన్నివేశాలు తీశాం. అందుకని మాఫియా మైనింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. అది నిజం కాదు. ఇప్పటివరకు శ్రీను వైట్ల చేసిన చిత్రాల్లో బాగా స్టయిలిష్‌గా ఉండే సినిమా ఇది. మహేష్‌తో ఆయన చేసిన ‘దూకుడు’కి, ఈ చిత్రానికీ టేకింగ్ పరంగా కూడా వ్యత్యాసం ఉంటుంది’’ అని చెప్పారు. పోలీసు డ్రెస్‌లో బెల్ట్ కీలకమైనది కాబట్టి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పోలీస్ బెల్ట్ తయారు చేయించామని, ఈ బెల్ట్ పొడవు సుమారు 12వేల అడుగులు ఉంటుందని, వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఈ బెల్ట్‌ని చూడొచ్చని నిర్మాతలు తెలిపారు.