
సాక్షి, సినిమా : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రచయిత కోన వెంకట్, మంచులక్ష్మీలు భావోద్వేగంతో కూడిన సందేశాలను విడుదల చేశారు.
‘భారతీయ చలనచిత్ర రంగం ఒక దేవతను కోల్పోయింది’ అని ప్రముఖ రచయిత కొన వెంకట్ పేర్కొన్నారు. శ్రీదేవి మరణవార్త విని యావత్ ప్రపంచంతో తాను షాక్‌కి గురయ్యానని.. ఆమెతో కలిసి మామ్ చిత్రానికి తాను పని చేశానని ఆయన చెప్పారు. తాను ఆమెతో కలిసి పని చేసిన మొదటి చిత్రం అదేనని.. దురదృష్టవశాత్తూ అదే ఆమె కెరీర్ లో చివరి చిత్రం అవుతుందని ఊహించలేదని కోన తెలిపారు. ఆమె లేని లోటు ఎవరూ, ఎప్పటికీ పూడ్చలేరని, ఎన్ని యుగాలైన ఆ లోటు భర్తీ కాలేదని చెప్పారు.
సౌమ్యురాలు.. సున్నితమైన వ్యక్తి, అందరినీ ప్రేమించే గుణం.. ఇలా ఎన్నో గొప్పలక్షణాలు ఆమెకున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కోన వీడియో సందేశంలో చెప్పారు.
She loved cinema.. Cinema loved her more... Never thought that I was writing her last film.. MOM 🙏 pic.twitter.com/g9m1wIt3lA
— kona venkat (@konavenkat99) 25 February 2018
‘ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు’
శ్రీదేవి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదని నటి మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ‘ఆమె నటన నుంచి ప్రేరణ పొందని నటీనటులు లేరంటే అతిశయోక్తి కాదేమో. తెర వెనుకాల హుందాగా ఉండే శ్రీదేవి కెమెరా ముందుకు వస్తే నటనతో విజృంభించేవారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా పోషించే ఆమె ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు చాలా తీసుకునేవారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం శోచనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మంచులక్ష్మీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment