తమిళసినిమా: తొలుత కాస్త తడబడ్డా రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాలతో సక్సెస్ రూట్‌లో పడ్డ యువ నటుడు గౌతమ్‌కార్తీక్. ఇటీవల హరహర మహాదేవకి, ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు లాంటి అడల్ట్ చిత్రాల్లో నటించి విమర్శలను ఎదుర్కొన్నా, ఆ చిత్రాల వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్ తన తండ్రి కార్తీక్‌తో కలిసి నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా దేవరాట్టం అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కొంబన్, మరుదు వంటి చిత్రాల ఫేమ్ ముత్తయ్య తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఈ దేవరాట్టం.
చిత్ర హీరో, సాంకేతిక వర్గం వివరాలను వెల్లడించిన చిత్ర వార్గలు హీరోయిన్ ఎవరన్న ఇప్పుడే వెల్లడించారు. ఆమె ఎవరో కాదు నటి మంజిమామోహన్. మాలీవుడ్‌లో బాలతారగా పరిచయమై పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మాతృభాషలోనే హీరోయిన్‌గానూ పరిచయమై ఆ తరువాత కోలీవుడ్‌కు సంచలన నటుడు శింబు సరసన అచ్చం ఎన్బ్‌దు మడమయడా చిత్రంతో దిగుమతైంది. ఆ తరువాత క్షత్రియన్, ఇప్పడై వెల్లుమ్ చిత్రాల్లో నటించింది. అయితే తొలి చిత్రం ఓకే అనిపించుకున్నా, ఆ తరువాత నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో నటి మంజిమామోహన్‌కు కోలీవుడ్‌లో చిన్న బ్రేక్ వచ్చింది. తాజాగా గౌతమ్ కార్తీక్‌తో జత కట్టే అవకాశం వరించింది. గ్రామీణ కథా చిత్రాల దర్శకుడి ఇమేజ్‌ను తె చ్చుకున్న దర్శకుడు ముత్తయ్య ఈ దేవరాట్టం చిత్రాన్ని అదే కోవలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో మంజిమామోహన్‌ను గ్రామీణ యువతిగా చూడబోతున్నామన్నమాట. చూద్దాం ఈ చిత్రం అయినా ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇస్తుందేమో!
Comments
Please login to add a commentAdd a comment