కంగనా రనౌత్‌కు ‘మెంటలా’! | Is media being unfair to Kangana Ranaut | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

Published Tue, Jul 16 2019 3:34 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Is media being unfair to Kangana Ranaut - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘జర్నలిస్టులు ద్రోహులు, చెదలు, సూడో సెక్యులరిస్టులు’ అంటూ ఒంటి కాలి మీద లేచి చిందులేసింది ఎవరో కాదు, బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఆమె నటించిన తాజా చిత్రం ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ ప్రమోషన్‌ కార్యక్రమం సందర్భంగా ఆమె అనవసరంగా పీటీఐ విలేకరితో గొడవ పడింది. దీంతో కోపం వచ్చిన ‘ఎంటర్టేన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’లు కంగనా రనౌత్‌ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరించాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత రగిలిపోయిన కంగనా ‘జర్నలిస్టులు ద్రోహులు, చెదలు, సూడో సెక్యులరిస్టులు’ అంటూ విమర్శించారు. తనపై బహష్కరణ పిలుపును ఉపసంహరించుకోకపోతే కోర్టుకు వెళతానని కూడా ఆమె హెచ్చరించారు. అందులో పలు సెక్షన్లను కూడా కోట్‌ చేశారు. కంగనా రనౌత్, ఆమె మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆమె సోదరి రంగోలి ఛందెల్‌లు మీడియాపై చేస్తున్న ఆరోపణలు అసభ్యంగా, అనాగరికంగా ఉన్నాయంటూ ముంబై ప్రెస్‌క్లబ్‌ ప్రతి విమర్శలు చేసింది. ఇలా అడ్డగోలుగా మాట్లాడడం కంగనా సోదరీమణులకు కొత్త కాదని, పలుసార్లు అర్థంపర్థం లేకుండా విమర్శలు కురిపించారని కూడా ప్రెస్‌క్లబ్‌ విమర్శించింది.

కంగనా నోటీసులు ఏ ముంది?
విలేకరుల బహిష్కరణ పిలుపును వ్యతిరేకిస్తూ కంగనా పంపించిన నోటీసులో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి. వర్కింగ్‌ జర్నలిస్టుల ప్రవర్తనను నియంత్రించే ‘ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలను ఉల్లంఘించారనడం మొదటిది. తన కార్యక్రమాలను జర్నలిస్టులు బహిష్కరించడం ద్వారా సినిమా మార్కెట్‌తో తనకున్న అవకాశాలను దెబ్బతీయడం, తద్వారా పోటీ చట్టాన్ని ఉల్లంఘించడం రెండో అంశమైతే, బహిష్కరించడమనేదే నేరపూరితమైన బెదిరింపు, దౌర్జన్యంగా డబ్బులు లాగడం, ఈ మూడో అంశం కింద జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ?
జూలై 11వ తేదీన జర్నలిస్టులను తిడుతూ పోస్ట్‌ చేసినా వీడియోలో తనను బ్యాన్‌ చేయాల్సిందిగా కంగనానే కోరింది. కాకపోతే కాస్త వ్యంగ్యంగా. ‘దయచేసి నా కార్యక్రమాలను బ్యాన్‌ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా కార్యక్రమాల ద్వారా మీరు సొమ్ము చేసుకోవడం ఇంకేమాత్రం ఇష్టం లేదు. ఇదే నాకు చేయగల గొప్ప మేలు’ అంటూ కోరింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు నిజంగానే బహిష్కరించడంతో ఇది అన్యాయమంటూ మరుసటిరోజే కంగనా నోటీసులు జారీ చేసింది. కాంపిటేషన్‌ చట్టంలోని 4వ సెక్షన్‌ కింద జర్నలిస్టులకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. ఒకరు మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోకుండా వారిని ఓ ‘బలమైన గ్రూపు’ అడ్డుకోవడం, లేదా అనవసరమైన ఆంక్షలు విధించడం తప్పని ఈ సెక్షన్‌ చెబుతోంది. అయితే ఇక్కడ ‘బలమైన గ్రూపు’ పరిధిలోకి జర్నలిస్టులు రారు. చట్టంలో బలమైన గ్రూపు పరిధిలోకి అదే మార్కెట్‌కు సంబంధించిన వ్యాపార సంస్థ వస్తోంది. అది సినిమా మార్కెట్‌ కనుక ఆ మార్కెట్‌కు సంబంధించిన సంస్థే వస్తోంది.

జర్నలిస్ట్‌ సంఘాలకు సంబంధం లేదు
ఎంటర్టేన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్‌కుగానీ ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాకుగాని జర్నలిస్టుల నియంత్రణతోగానీ, మీడియా వ్యాపారంతోగానీ సంబంధం లేదు. గిల్డ్‌ అయితే రిజిస్టర్‌ సంస్థ కూడా కాదు. ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, వినోద కార్యక్రమాలతోపాటు వత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వేదిక మాత్రమే. ఈ రెండింటికీ జర్నలిస్టుల ప్రవర్తతతో నిమిత్తం లేదు. ఇక ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా టూకీగా జర్నలిస్టు విలువలు ఎలా ఉండాలో సూచిస్తుంది. యాజమాన్యానికి, జర్నలిస్టులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికే ఎక్కువగా పనిచేస్తుంది. పైగా జర్నలిస్టుల బహిష్కరణ పిలుపును అమలు చేసినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు.

‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాకు సంబంధించి జూలై 7వ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని వివిధ మీడియాలు విస్తతంగానే కవర్‌ చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిగానీ, కంగనా రనౌత్‌కు సంబంధించిగానీ ఎలాంటి విలేకరుల కార్యక్రమాలు చోటు చేసుకోలేదు. జర్నలిస్టుల బహిష్కరణ పిలుపును ‘నేర పూరిత బెదిరింపులు’ అని నోటీసులో పేర్కొనడం మరీ అన్యాయం. వారిచ్చిన బహిష్కరణ పిలుపు అనేది  ఓ నిరసన. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది వారి హక్కు. కంగనా నుంచి ఇక్కడ జర్నలిస్ట్స్‌ గిల్డ్‌ కోరుతున్నది ఆర్థిక సహాయం కాదు, కేవలం క్షమాపణలు.
 వాస్తవానికి జర్నలిస్టుల కారణంగానే కంగనా రనౌత్‌కు ఈ రోజు మార్కెట్‌లో మంచి పేరు వచ్చింది. ఆమె నటించిన ప్రయోజనాత్మక చిత్రాలను కొంత మంది జర్నలిస్టులు పనిగట్టుకొని ప్రోత్సహించడం వల్ల ఆమెకు కూడా మంచి నటిగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే జర్నలిస్టులను ఆమె ఆడిపోసుకోవడం చూసి ఆమెకేమైనా ‘మెంటల్‌’ వచ్చిందా ? అంటూ ఆశ్చర్యపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement