'జిల్లా'పై కన్నేసిన మెగాస్టార్!
రాజకీయాల్లో ఆశించినంతగా తన ముద్రను వేసుకోలేకపోయిన చిరంజీవి మళ్లీ టాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది. ఎన్నాళ్లుగానో ప్రేక్షకులను ఊరిస్తున్న తన 150 చిత్రంపై ఒకప్పుటి వెండితెర మెగాస్టార్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అడపాదడపా 150 చిత్రం చేయాలంటూ తన కోరికను బయటకు చెపుతూ వస్తున్న ఆయనను తాజాగా ఓ తమిళ చిత్రం విశేషంగా ఆకర్షించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో తమిళంలో విడుదలైన 'జిల్లా' చిత్రం అమితంగా ఆకట్టుకుందని.. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ఫిలింనగర్ సమాచారం.
మలయాళ నటుడు మోహన్ లాల్, విజయ్ నటించిన 'జిల్లా'పై మిశ్రమ స్పందన వెలువడుతోంది. తమిళ చిత్రంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను చిరంజీవి, విజయ్ పాత్రను తనయుడు రామ్ చరణ్ తో చేయించాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ వార్త కార్యరూపం దాల్చితే మెగా అభిమానులకు డబుల్ ధమాకానే అని చెప్పవచ్చు. తన 150 చిత్రం కోసం టాలీవుడ్ కు చెందిన ఓ మాస్ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాక ఎన్నాళ్లుగానో 150 చిత్రం కోసం వేచి చూస్తున్న మెగా అభిమానులకు కూడా ఓ పండగనే అనుకోవచ్చు. 'జిల్లా' మెగా చిత్రంగా రూపొందుతుందో లేదో వేచి చూడాల్సిందే.