
నడిగర్ సంఘ నిర్వాహకులు
పెరంబూరు: కొన్ని రోజులుగా పత్రకల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో, ప్రసార సాధనాల్లోనూ వస్తున్న పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార ఘోర సంఘటన మనసును కలిచివేస్తోందని దక్షిణ భారత నటీనటుల సంఘ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలాంటి ఆకృత్యాలను కొంతమంది చాలా కాలంగా చేస్తున్నట్లు ఆధారపూర్వకంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
ఈ సంఘటన వెనుక ఎవరున్నారన్నది గుర్తించి, వారు ఎంత పెద్ద వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ సంఘటనపై పోలీస్‌అధికారులు నిజాయితీగానూ, ధైర్యంగానూ చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. ఆ నిజాయితీకి దక్షిణభారత నటీనటుల సంఘం ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. అదే విధంగా సెల్‌ఫోన్‌లో ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముప్పు ఉందన్నది ఈ తరం యువత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మనకు మంచి భవిష్యత్‌ను అందించడానికి మన తల్లిదండ్రులకు ఉండే బాధ్యత, కలలు మరెవరికీ ఉండవన్నారు. అందువల్ల కొంత వయసు వరకూ యువత తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరితోనూ పరిచయాలు, స్నేహాసంబంధాలు పెట్టుకోవద్దని దక్షిణ భారత నటీనటుల సంఘం కోరుకుంటోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment