సాహసమే శ్వాసగా...
నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమా మోహన్ కథానాయిక. రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘యువతతో పాటు అన్ని వర్గాల వారిని అలరించేలా తెరకెక్కించిన చిత్రమిది.
ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగచైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా మరో మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 19న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
పంజాబీ సినిమా రీమేక్‌లో!
మేనల్లుడు అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. పంజాబీలో మంచి హిట్టయిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సింగ్ వర్సెస్ కౌర్’కి రీమేక్ ఇదని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను మారుస్తున్నారట. ప్రస్తుతం నాగచైతన్య ‘ప్రేమమ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న సినిమాలో చైతు నటించనున్నారు. కల్యాణ్‌కృష్ణ సినిమా పూర్తయిన తర్వాత ‘సింగ్ వర్సెస్ కౌర్’ షూటింగ్ ప్రారంభమవుతుందట!