- దాసరి
‘‘చైతూ (నాగచైతన్య) ని చూస్తుంటే మనింట్లో, పక్కింట్లో ఉండే బ్రదర్‌లా తమాషాగా ఉంటాడు. మాటలతో, నవ్వుతో పడేస్తాడు. చైతూ నవ్వులో చాలా మాయ ఉంది. ఆ నవ్వుతోనే ఓ హీరోయిన్‌ని పడేశాడు. ‘ఏ మాయ చేసావె’తో ఆ హీరోయిన్ ఏ మాయ చేసిందో!’’ అని చమత్కారంగా అన్నారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. నాగచైతన్య హీరోగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం ‘ప్రేమమ్’. చందు మొండేటి దర్శకుడు. గోపీ సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతమందించిన ఈ చిత్రం పాటలను ఏయన్నార్ జయంతి సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. దాసరి పాటల సీడీలను ఆవిష్కరించారు. హీరో అఖిల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
నాగార్జున మాట్లాడుతూ : ‘‘ప్రేమకథా చిత్రాలను మీరెప్పుడూ (ప్రేక్షకులు) ఆదరించారు. నాన్నగారి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, నా ‘గీతాంజలి’ చిత్రాలకు సరిపోయే ప్రేమకథ ఈ ‘ప్రేమమ్’. ఈ చిత్రం కోసం చైతూ గడ్డం పెంచిన ప్పుడు.. బాగుంది. నేను ‘ఓం నమో వెంకటేశాయ’కి పెంచితే బాగుంటుందని ఆలోచించా. పెంచిన తర్వాత చైతూ నా గడ్డమే బాగుందన్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తెలుగు లోనూ అంతే హిట్టవుతుందని నా నమ్మకం. అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ చేయాలనుకుంటున్నారు’’ అన్నారు.
దాసరి మాట్లాడుతూ : ‘‘ఏయన్నార్‌గారిది, నాది యాభై ఏళ్ల అనుబంధం. ఆయన కెరీర్‌లో 27 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుణ్ణి నేనే. అందులో 22 ప్రేమకథలే. ప్రేమకు, ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని. ప్రేమకు అర్థం అక్కినేని కుటుంబం. అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయ్యింది. ఈ రోజున చైతూతో రిపీట్ కాబోతోంది. అఖిల్‌తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరు కుంటున్నా. ‘ఏ మాయ చేశావే’, ‘100 పర్సంట్ లవ్’లో చైతూ అక్కినేని వారసుడు అనిపించాడు. మధ్యలో యాక్షన్ సినిమాలు చేసినప్పుడు నాగార్జునతో వద్దని చెప్పా. ప్రేమకు మరణం లేదు. వందమందిని కొట్టేసే హీరోగా కాకుండా, వందమంది అమ్మాయిల హార్ట్ దోచుకునే హీరోగా చైతూ పేరు తెచ్చుకోవాలి.
ఏయన్నార్‌గారి అశీస్సులతో నా ఆప్తుడు చినబాబు (ఎస్.రాధాకృష్ణ) కుమారుడు నాగవంశీ నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, తర్వాత అఖిల్ ప్రేమకథే చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘సినిమాలు హిట్టైనా.. ఫ్లాపైనా.. కొన్నేళ్లుగా నన్ను సపోర్ట్ చేసింది మా అభిమానులే. బాగా ప్రేమించి చేసిన చిత్రమిది’’ అన్నారు నాగచైతన్య. ‘‘ట్రైలర్ చూస్తుంటే మా అన్నయ్య ఈ ప్రపంచంలో ప్యూరెస్ట్ లవర్ అనిపిస్తోంది. ప్రేమకథల్లో తనతో నేను పోటీపడలేను.. ఫాలో అయిపోతా’’ అన్నారు అఖిల్. చిత్ర నిర్మాతలు నాగవంశీ, ఎస్.రాధాకృష్ణ, దర్శకుడు చందు మొండేటి, సంగీత దర్శకులు రాజేశ్ మురు గేశన్, గోపీసుందర్, హీరోయిన్లు శ్రుతీ హాసన్, మడోన్నా, నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకులు మారుతి, కల్యాణ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆ నవ్వుతోనే చైతూ ఓ హీరోయిన్‌ని పడేశాడు!
Published Tue, Sep 20 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement