‘‘జనరల్‌గా నాకు సినిమాలు తీయాలంటే ప్రేమ. ‘హలో’ అఖిల్ సినిమా కాబట్టి ఆ ప్రేమ ఇంకొంచెం పెరిగింది. ‘రాజన్న’ సినిమాకి 18 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇంత బడ్జెట్ ఎందుకని ఎవరూ అడగలేదు. ‘హలో’ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిందట కదా? అంటున్నారు. అవును.. అఖిల్ సినిమా కాబట్టే అంత ఖర్చు పెట్టా. గ్రాండ్‌గా సినిమా తీశా’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో నాగార్జున నిర్మించిన ‘హలో’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పలు విశేషాలు పంచుకున్నారు.
► అఖిల్‌తో ఓ సినిమా చేసిపెట్టమని ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్‌ని అడిగా. సూర్యతో ‘24’ సినిమా తర్వాత చేస్తానని, ఇప్పుడు ‘హలో’ చేశారు. నాన్నగారికి (నాగేశ్వరరావు) ‘మనం’ వంటి అద్భుతమైన సినిమా ఇచ్చిన విక్రమ్ అఖిల్‌కి ‘హలో’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించినందుకు థ్యాంక్స్.
► అఖిల్‌కి ఎలాగైనా ఓ మంచి హిట్ ఇవ్వాలనే తపనతో ‘హలో’ సినిమా స్టార్ట్ చేశాం. తొలి సినిమాతో దెబ్బ తిన్న అఖిల్ కూడా ఎలాగైనా రెండో సినిమాతో హిట్ సాధించాలనే కసితో ఈ సినిమా చేశాడు. వాడి కష్టం ఈ చిత్రంలో కనిపిస్తుంది. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
► ‘హలో’ సినిమా విషయంలో అన్నిట్లోనూ నేను ఇన్‌వాల్వ్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో రాశారు. అది అవాస్తవం. కథ ఫైనల్ అయ్యేవరకూ, సినిమా పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్ష¯Œ లో మాత్రమే నేను జోక్యం చేసుకుంటా. డైరెక్షన్‌లో నా జోక్యం ఉండదు. విక్రమ్‌కే పూర్తిగా వదిలేశా. అయితే క్రియేటివ్ జీనియస్‌కి టైమ్ సెన్స్ ఉండదు. అప్పుడప్పుడు అది మనం వారికి గుర్తు చేస్తుండాలి అంతే.
► అమల డ్యాన్స్ చేయడం మానేసింది (నవ్వుతూ). అయితే ‘హలో’ సినిమా చూసిన తర్వాత ఇంటికొచ్చి నా చుట్టూ డ్యాన్స్ చేసింది (నవ్వుతూ). సినిమా తనకు అంత బాగా నచ్చింది. అమల అమ్మకి తెలుగు రాకున్నా ‘హలో’ మూడుసార్లు చూసింది. ‘ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నారు?’ అని నేనడిగితే ‘నా గ్రాండ్ సన్ కదా’ అన్నారావిడ.
► ‘హలో’ సినిమా చూసిన చిరంజీవిగారు భావోద్వేగంతో అఖిల్‌ని రెండు నిమిషాలపాటు హత్తుకున్నారు. అంత బాగా నచ్చింది ఆయనకు. కల్యాణీని నటుడు ప్రియదర్శన్ కూతురనో, విక్రమ్ గురువుగారమ్మాయి అనో హీరోయిన్‌గా తీసుకోలేదు. ఆడిషన్స్, స్క్రీన్‌టెస్ట్ చేశాక ఓకే చేశాడు విక్రమ్.
► నేను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు వచ్చినా ‘గీతాంజలి, శివ’ చిత్రాల్లో నాగార్జున బాగా చేశాడంటారు. ఆ పాత్రలు నాకు సూట్ అయినట్లు ‘హలో’లో అఖిల్ పాత్రని విక్రమ్ తీర్చిదిద్దారు.
► అఖిల్ పాడతాడని మాకు తెలియదు. మాకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మూణ్ణెళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ‘ఏవేవో కలలు కన్నా’ పాట పాడాడు. ఆ పాట నాకు వినిపించగానే షాక్ అయ్యా. వాడిలో సగం బెంగాలీ బ్లడ్ ఉంది కదండీ అందుకే పాడుంటాడు. బెంగాలీ వాళ్లు ఎక్కువగా పాటలు పాడుతుంటారని అమల నాకు చెప్పింది.
► నేను, విక్రమ్, అఖిల్ కూర్చొని ఫైట్స్ హాలీవుడ్‌లా ఉండాలని డిస్కస్ చేసుకున్నాం. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ బాబ్ బ్రౌన్‌తో పార్క్ ఓవర్ ఫైట్స్ తీశాం. పైగా అఖిల్ అథ్లెటిక్ కావడంతో బాగా చేయగలిగాడు.
► అఖిల్‌కి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కరెక్ట్‌గా సరిపోతారని చేయమన్నా. మరీ అమ్మ రోల్ ఏంటి నాగ్? అంది. ‘నీ పాత్రకి చప్పట్లు కొడతారు’ అంటే చేసింది. ఇటీవల నెగెటివ్ పాత్రలు చేస్తున్న జగపతిబాబు ఇందులో నాన్న పాత్రలో ఒదిగిపోయారు. తండ్రి పాత్ర మీరే చేసి ఉండొచ్చు కదా? అన్న ప్రశ్నకు నాకింకా అంత వయసు రాలేదు అన్నారు (నవ్వుతూ).
► తెలుగు ప్రేక్షకులు చాలా మంచివారు. సినిమా బాగుంటే తెలుగు సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా ఆదరిస్తారు. బయటి ప్రొడక్షన్‌లో విక్రమ్ ఓ సినిమా చేశాక నాగచైతన్యతో మా బ్యానర్‌లో మూడో సినిమా చేస్తాడు. నేను–నాని నటించే సినిమా కథని శ్రీరామ్ ఆదిత్య వినిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment