తెరపై మళ్లీ ఈ జోడీ..?
పెళ్లయిన ఆడవాళ్లు కెరీర్‌ని త్యాగం చేయాల్సిందేనా? అంటే.. ‘అవసరం లేదు’ అని చాలామంది అంటారు. కాకపోతే, కుటుంబం కోసం ఇష్టపూర్వకంగానే ఇంటికి పరిమితమయ్యే ఆడవాళ్లు ఉంటారు. నమ్రత ఆ జాబితాలోకే వస్తారు. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో మోడలింగ్‌కి దూరమయ్యారు. ఇక, మహేశ్‌బాబుని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యారు.
ఇప్పుడీ దంపతులకు ఒక బాబు (గౌతమ్), పాప (సితార) ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్‌కి ఎనిమిదేళ్లు. త్వరలో సితారకు రెండేళ్లు నిండుతాయి. దాంతో నమ్రత మళ్లీ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారట. బహుశా అందుకేనేమో మునుపటిలా చక్కగా నాజూగ్గా తయారయ్యారు. ఓ ప్రముఖ పత్రికకు సంబంధించిన ఫొటోషూట్‌లో కూడా పాల్గొన్నారు నమ్రత. ఆ పత్రిక ముఖచిత్రంపై ఆమెను చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. అంత బాగున్నారామె.
త్వరలో ఓ ప్రముఖ నగల దుకాణానికి ప్రచారకర్తగా చేయనున్నారట నమ్రత. అది మాత్రమే కాదు.. మరికొన్ని ఉత్పత్తులకు అవకాశం వస్తే, చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే వ్యాపార ప్రకటనల పరంగా మహేష్ దూసుకెళుతున్నారు. ఇప్పుడు నమ్రత కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. అంటే, భవిష్యత్తులో ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా ఉత్పత్తికి ప్రచారకర్తలుగా చేసినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ జంటగా చేస్తానంటే ఏ ఉత్పత్తిదారు మాత్రం వదులుకుంటాడు. ఎంచక్కా క్యాష్ చేసుకోడూ!