తెలుగు తెరపై సావిత్రి కట్టూబొట్టూ.. ఆహార్యమూ అన్నీ అప్పట్లో యువతులకు, మహిళలందరికీ అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటిని మరోసారి తెరపై పరిచయం చేసిన ‘మహానటి’ సినిమాలో ఆ పాత్రకు తగిన జీవం పోశారు నగరానికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్‌లు గౌరంగ్‌షా, అర్చనారావులు. ఇటీవల ప్రకటించిన సినీ జాతీయ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌కి కూడా పురస్కారం లభించడంతో సిటీ ఫ్యాషన్ రంగానికి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సిటీ ఫ్యాషన్ రంగానికి ఈ ఘనత దక్కడం ఇదే తొలిసారి. గౌరంగ్ షాతో పాటు నగరానికే చెందిన అర్చనారావు, కోల్‌కతా స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్‌లు ఈ కీర్తిని సాధించడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో :టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి వంటి బాలీవుడ్ సినిమాల్లో తారల వస్త్రధారణ తీర్చిదిద్దిన డిజైనర్లు కొంతకాలం పాటు వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవారు. అలాంటి ఘనత ఇప్పటిదాకా నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్ ఇచ్చిన దాఖలాలతో పాటు సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ అరుదే. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా.. మరో ఇద్దరితో కలిసి మహానటి సినిమాకు అందించిన కాస్ట్యూమ్స్‌కు ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో చోటు దక్కడం విశేషం. దీని ద్వారా మన డిజైన్లు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారారు. జామ్‌దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్‌ల మేళవింపు దుస్తులు ముఖ్యంగా చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్.. వింటేజ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తెరలేపారు. షర్మిలా ఠాగూర్‌లతో పాటు మరెంతో మందికి డిజైన్ చేసిన ఇదే గౌరంగ్ తొలి సినీ రంగప్రవేశం కావడం విశేషం.
చేనేతలకు దక్కిన గౌరవం
ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్‌కు డిజైన్ వర్క్ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్ షా,ఫ్యాషన్ డిజైనర్
ఏడాదిన్నర కృషి ఫలితం..
అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాకు ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదించారు గౌరంగ్. అలనాటి టెక్స్‌టైల్స్ పునఃసృష్టి కోసం తరచూ మ్యూజియంలను కూడా ఆయన బృందం సందర్శించింది. నాటి టెక్స్‌టైల్, డిజైన్, టెక్చర్, కలర్‌లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం వహించింది. ఆర్నెళ్లకుపైగా రీసెర్చ్, ఏడాదిపైగా వీవింగ్‌కు, టెక్చరింగ్, కలరింగ్‌లకు కేటాయించాల్సి వచ్చింది. నటి సావిత్రి నిజజీవిత ఆహార్యాన్ని తెరపై మెరిపించేందుకు తీవ్రంగా శ్రమించాం అంటున్న గౌరంగ్.. కనీసం 100కిపైగా చేనేత కళాకారులు నిర్విరామంగా ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్ కోసం పని చేశారన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం వెచ్చించామన్నారు. దేశంలోని కాంచీపురం, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించి కోట, మంగళగిరి, బ్లాక్ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు.
శ్రద్ధగా.. భక్తిగా..
నాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆనాటి రంగులతో వీటిని బ్యాలెన్స్ చేశారు. చిన్నతనం నుంచి చివరి దశ దాకా ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రి కోసం మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను స్వర్ణయుగంలాంటి సినీ దశ కోసం హెవీ బ్రొకేడ్స్, సిల్క్స్, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్‌లను వినియోగించారు. అలాగే చరమాంకానికి తగ్గట్టూ ఏర్చికూర్చారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం నన్ను శాటిన్స్‌ను అందించమన్నారు. ఆమె లుక్స్ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. భారీ కాంజీవరమ్ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే ‘మాయాబజార్’లోని సావిత్రి లుక్ కోసం 3 నెలలు పట్టింది’ అని చెప్పారు గౌరంగ్ షా.
జీవితంలో మరిచిపోను..
జాతీయ అవార్డు గెలుపొందడం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఎంతో రిసెర్చ్ చేసి, ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశాం. దర్శకుడు నాగ్‌అశ్విన్ నాపై ఉంచిన నమ్మకం నన్ను మరింతగా ఆ చిత్రంతో మమేకమయ్యేలా చేసింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలతో పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. మన సృజన వెండితెర మీద ప్రత్యక్షం అవడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మహానటికి పనిచేసిన రోజుల్ని జీవితంలో మర్చిపోలేను. – అర్చనారావు, డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment