నటుణ్ని కాకుంటే ప్రధానమంత్రి అయ్యుండేవాడిని
లాహోర్: 'రైల్వే గోడౌన్ లో పనిచేసిన మా నాన్న సిమెంట్ దొంగతనం కేసులో జైలు పాలయ్యాడు. ఉద్యోగంలో నుంచి తీసేయడంతో రైల్వే క్వార్టర్స్ ఖాళీచేయాల్సివచ్చింది. అమ్మా, అన్నయ్య, నేను రోడ్డున పడ్డాం. అప్పుడు నాకు ఆరేళ్లు. కుటుంబపోషణ కోసం అన్నయ్య స్టేషన్ లోనే కూలీగా మారాడు. నేనేమో అంగట్లో టీ అమ్మేవాణ్ని' అంటూ పొరుగుదేశస్తులతో తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు లిజెండరీ యాక్టర్ ఓంపురి. లాహోర్ లోని అలహమ్రా ఆర్ట్ సెంటర్ లో ప్రారంభమైన అంతర్జాతయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన భారత్- పాక్ సంబంధాలపై మనసులోని మాటలు బయటపెట్టారు.
ఇరుదేశాల మధ్య ప్రతిబంధకాలనే తాళాలు వేసున్నప్పటికీ, వాటిని తెరవగలిగే తాళం చెవులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల వద్ద ఉన్నాయని, ఇద్దరు ప్రధానుల నిర్ణయాలే ఇరు ప్రాంతల ప్రజల ఐక్యతకు బాటలువేస్తాయని, పాకిస్థాన్ కు రావటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని ఓంపురి అన్నారు. నటుడు కాకుంటే ఏమయ్యేవారు? అనే మీడియా ప్రశ్నకు..'చిన్నప్పుడు చాయ్ అమ్మాను కదా, మెల్లగా టీ దుకాణం పెట్టుకుని ఇప్పటికి ప్రధానమంత్రి అయ్యుండేవాడిని' అని చమత్కరించారు.