అప్పుడు సీత.. ఇప్పుడు ద్రౌపది!
సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? అనడిగితే... చాలామంది అంజలీదేవి పేరు చెబుతారు. ‘లవకుశ’ సినిమాలో అంత అద్భుతంగా నటించారామె. నాటి తరంలో సీత పాత్రలో అంజలీదేవి మెప్పిస్తే నేటి తరంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు నయనతార. ఆ సినిమా తర్వాత నయనతార గ్లామరస్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు.. నటనకు అవకాశమున్న సంప్రదాయబద్ధమైన పాత్రలూ చేయగలరనే అభిప్రాయం బలపడింది.
ఇప్పుడీ బ్యూటీకి కన్నడ ‘కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించే ఛాన్స్ వచ్చిందట. తమిళంలో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించే విషయమై హామీ ఇవ్వలేదట. అయితే మంచి అవకాశం కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసి, గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహించవచ్చు. ఈ నెల 23న ‘కురుక్షేత్ర’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవేళ నయన అంగీకరిస్తే, ‘సూపర్’ తర్వాత కన్నడంలో ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, భీష్ముడిగా అమ్రీష్, కర్ణుడిగా రవిచంద్రన్ నటించనున్నారు.