
ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతోనే నటి నయనతార అవివాహితగా ఉండిపోయిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నానుం రౌడీదాన్, మాయ చిత్రాల ముందు వరకూ నయనతార ఒక కమర్షియల్ హీరోయిన్‌గానే ఉండేది. అదే సమయంలో పలు సమస్యలు, వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా నటుడు శింబుతో ప్రేమ వ్యవహారం చర్చనీయంగానే మారింది. కాగా ఇక్కడ దర్శకుడు జీటీ.నందు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈయన శింబు హీరోగా కెట్టవన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
నందు ఇటీవల ఒక టీవీ.ఛానల్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ కెట్టవన్ చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సన్నాహాలు చేశామని, ఆయన ఇప్పుడు కుదరదు అని చెప్పారన్నారు. దీంతో నటుడు ధనుష్‌తో చేద్దామని దర్శకుడు భూపతిపాండియన్‌తో తన వద్ద కథ ఉన్న విషయాన్ని ధనుష్‌కు చెప్పమని కోరానన్నారు. కాగా మళ్లీ శింబునే కెట్టవన్ చిత్రాన్ని చేద్దామని చెప్పారన్నారు. అలా కొంత షూటింగ్ జరిగిన తరువాత తాను ధనుష్‌కు కథ చెప్పిన విషయం తెలుసుకుని శింబు కోపగించుకున్నారన్నారు. అప్పటి నుంచి సమస్య మొదలైందని చెప్పారు.
శింబు నయనతార విడిపోవడానికి కారణం
శింబు, నయనతార ప్రేమ వ్యవహారం గురించి, వారు విడిపోవడం గురించి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. తనకు తెలిసి ఒక విషయం ముఖ్యమైనదిగా ఉండవచ్చునన్నారు. చాలా కాలం ముందు స్థానిక ట్రిప్లికేన్‌లోని పిళ్లైయార్ కోవిల్ వీధిలో ఉండే ఒక జ్యోతిష్యుడిని తానూ, నటుడు శింబు తరఫు వ్యక్తి ఒకరు కలిశామన్నారు. అప్పుడు శింబు, నయనతార జాతకాలు చూసిన ఆ జ్యోతిష్యుడు నయనతారకు వివాహం అయితే ఆమె నడిరోడ్డున పడే పరిస్థితి ఏర్పడ వచ్చని, పెళ్లి చేసుకోకపోతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పారన్నారు.