
ధోనీకి రూ. 40 కోట్లు ఇవ్వలేదు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథను సినిమాగా తీసేందుకు అతనికి 40 కోట్ల రూపాయలు ఇచ్చి హక్కులు పొందినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని దర్శకుడు నీరజ్ పాండే చెప్పాడు. ధోనీ జీవితకథ ఆధారంగా నీరజ్ దర్శకత్వంలో 'ఎంఎస్ ధోనీ.. ద అన్టోల్డ్ స్టోరీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకానుంది. కాగా ఈ సినిమాలో ధోనీ మాజీ గాళ్ ఫ్రెండ్ పాత్ర ఉంటుందా అన్న విషయంపై నీరజ్ పెదవి విప్పలేదు.
ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్ చేసింది. 'ఎంఎస్ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేయగా, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు రికార్డు స్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడయ్యాయి.