నిత్యకు వెంకీ జోహార్
కథల ఎంపికలో విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు వైవిధ్యం కనబరుస్తున్నారు. కథానాయకుడిగా మూడు దశాబ్దాల అనుభవాన్ని రంగరించడంతో పాటు వయసునూ దృష్టిలో పెట్టుకుని కథలను ఎంపిక చేసుకుంటున్నారు. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలకు ఓటేస్తున్న నటి నిత్యా మీనన్. ఇప్పుడు వీరిద్దరూ జోడీ కడుతున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆడాళ్ళూ.. మీకు జోహార్లు’.
ఇందులో వెంకీ సరసన నిత్యా మీనన్ నటించనున్నారు. ‘‘వయసులో వ్యత్యాసం గల ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే...’’ అనే కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలను మేళవించి చక్కటి కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. వెంకటేశ్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ చిత్రంలో ఉంటాయి. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత.