పూరి జగన్నాథ్, శ్రీవాస్, బి. గోపాల్, కేకే రాధామోహన్, గోపీచంద్, ముత్యాల సుబ్బయ్య, కె. చక్రవర్తి, సంపత్ నంది
‘‘టి. కృష్ణ మెమోరియల్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావుగారు నా దగ్గరికి గోపీచంద్‌ని తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నట్లు గోపీచంద్ అన్నాడు. అందంగా ఉన్నాడు. మంచి వాయిస్. మన బ్యానర్‌లోనే గోపీచంద్ హీరోగా సినిమా తీద్దామనుకుని ‘తొలివలపు’ తీశాం. గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ పెద్ద హిట్ అవ్వాలి. తను వంద సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. రాధామోహన్ ఇంకా మంచి సినిమాలు తీయాలి’’ అని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అన్నారు.
గోపీచంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పంతం’. కె.చక్రవరి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారు గ్రేట్ డైరెక్టర్. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోతే పిల్లలు ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. ఆ కష్టం తెలిసిన మనిషి గోపీచంద్. షూటింగ్స్‌లో నాకు ఎప్పుడూ వాళ్ల అమ్మగారి గురించి చెప్పేవాడు. వాళ్ల అమ్మ అంటే గోపీకి ఇష్టం. గోపీతో వర్క్ చేయడానికి వెరీ హ్యాపీ.
ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నేను రెడీ’’ అన్నారు. ‘‘నాకు ఫస్ట్ చాన్స్ ఇచ్చిన గోపీచంద్‌గారికి రుణపడి ఉంటా. ‘లక్ష్యం, లౌక్యం’ చిత్రాల కంటే ‘పంతం’ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ శ్రీవాస్. ‘‘నాకు బ్రేక్ ఇచ్చిన సత్యసాయి ఆర్ట్స్ సంస్థ దర్శకుడు చక్రిగారికి కూడా పెద్ద బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంపత్ నంది. రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు మోస్ట్ లవబుల్, కోపరేటివ్ హీరో. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.
చక్రిగారికి ఇది తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా చేశారు. ఆయనకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు మాటల రచయిత రమేశ్‌రెడ్డిగారు. ఈ నెల 5న ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. యూఎస్‌లో జూలై 4న రిలీజ్ అవుతుంది. అది లాంగ్ వీకెండ్ కావడంతో పాటు 4న యూఎస్ ఇండిపెండెన్స్ డే. అందరూ మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన రాధామోహన్‌గారికి థ్యాంక్స్. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన గోపీచంద్‌సార్‌కి ధన్యవాదాలు.
మీ నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా’’ అన్నారు కె. చక్రవర్తి. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘నా 25 చిత్రాలకు పనిచేసిన దర్శకులందరికీ థ్యాంక్స్. నాలాంటి హీరోలను క్రియేట్ చేసేది ఈ హీరోలే (డైరెక్టర్లని చూపిస్తూ). వాళ్లు రాసుకున్న పాత్రల్లో మేం యాక్ట్ చేస్తాం. రియల్ హీరోస్ వీళ్లంతా. నా తొలి సినిమా ‘తొలివలపు’ నిర్మాత నాగేశ్వరరావుగా రు , దర్శకులు ముత్యాల సుబ్బయ్యగారు ఎంకరేజ్ చేయకుంటే ఈ రోజు నేను 25 సినిమాల ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాణ్ణి కాదు.
‘పంతం’ సినిమా స్టార్ట్ అవడానికి కారణమైన ప్రసాద్ మూరెళ్లగారికి, రమేశ్‌రెడ్డిగారికి థ్యాంక్స్. చక్రి తొలి రోజు ఏ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడో చివరి రోజూ అదే కాన్ఫిడెన్స్‌తో తన ‘పంతం’ నిరూపించుకుని చాలా బాగా చేశారు. తొలిరోజు నుంచి ఈరోజు వరకూ రాధామోహన్‌గారు ఒకే మాటపై నిలబడి ఉన్నారు. వెరీ జెన్యూన్ ప్రొడ్యూసర్. ఆయన లెక్క పక్కాగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో సినిమాలు చేసిన పలువురు దర్శకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment