కళాతపస్వికి ఫాల్కే అవార్డు ప్రకటించడం తనకెంతో ఆనందం కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ దేశం గర్విందగ్గ సినిమాలు తీశారని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బుధవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరు విశ్వనాథ్ దంపతులను శాలువాతో సత్కరించారు.
కళాతపస్వికి ఫాల్కే అవార్డు ప్రకటించడం తనకెంతో ఆనందం కలిగించిందని, ఇది ప్రతి తెలుగువాడికి గర్వకారణమని పవన్ అన్నారు. శంకరాభరణం చిత్రాన్ని చిన్నప్పుడు చాలాసార్లు చూశానని చెప్పారు. విశ్వనాథ్ సినిమాల్లో శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం తనకు ఇష్టమన్నారు. స్వయంకృషి సినిమా షూటింగ్ చూసేందుకు చాలాసార్లు వెళ్లానని గుర్తుచేసుకున్నారు.
విశ్వనాథ్ తీసిన చిత్రాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమని తివిక్రమ్ అన్నారు. ఆయన తీసిన 12 ఉత్తమ చిత్రాలతో ఒక డిస్క్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మంగళవారం విశ్వనాథ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో సినీ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.