పదేళ్ల తర్వాత!
‘‘సాధారణంగా నా సినిమాలు చూస్తే సీనియర్ నటులు ఎవరూ ఉండరు. ఎందుకంటే.. డైరెక్టర్ అనేవాడు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తుంటాడు. సీనియర్ నటులు చాలా సినిమాలు చేస్తుంటారు. ఆ అనుభవంతో ఏ డైరెక్టర్ ఏ షాట్ ఎలా తీస్తాడో వాళ్లు తెలుసుకుంటారు. వాళ్లు సెట్‌లో ఉంటే నేను షాట్ తీస్తున్నప్పుడు కరెక్ట్‌గా తీస్తున్నానా? లేదా? అని వాళ్లు అనుకుంటున్నారేమో అని నాకు భయమేస్తుంటుంది.
ఈ భయాలు ఎందుకురా బాబూ అని నేను సీనియర్ నటులను తీసుకోను’’ అని ‘మన ఊరి రామాయణం’ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు సుకుమార్ అన్నారు. సీనియర్స్ పట్ల తనకున్న గౌరవాన్ని ఆ విధంగా సుకుమార్ చెప్పారు. కానీ, క్యారెక్టర్ డిమాండ్ మేరకు సీనియర్స్‌ని తీసుకుంటున్నారాయన. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న సినిమాకి ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నారట.
పదేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగడం’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ నటించారు. కానీ, అందులోది చిన్న పాత్రే. కేవలం రెండు రోజుల్లో ప్రకాశ్‌రాజ్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలసి పనిచేయలేదు. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నది నిజమే అయితే చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరిందనొచ్చు. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత రామ్‌చరణ్‌తోనూ, ‘జగడం’ తర్వాత సుకుమార్‌తోనూ ప్రకాశ్‌రాజ్‌కి ఇది రెండో సినిమా అవుతుంది.