నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు! | pranavi birth day special | Sakshi
Sakshi News home page

నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు!

Published Sat, Aug 16 2014 1:02 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు! - Sakshi

నా పాట విని లతాజీ చాలా మెచ్చుకున్నారు!

చిరు ప్రాయంలోనే స్వర ప్రయాణం మొదలుపెట్టి దశాబ్ద కాలంగా తన గానంతో శ్రోతల్ని తన్మయానికి గురిచేస్తున్నారు ప్రణవి. గాయనిగా, అనువాద కళాకారిణిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న ప్రణవి పుట్టిన రోజు నేడు.  ఈ సందర్భంగా ప్రణవితో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ.
 
ప్రస్తుతం ఏ ఏ సినిమాలకు పాడుతున్నారు?
ముందే చెప్పేయకూడదు. ఎందుకంటే... విడుదలయ్యేంత వరకూ మేం పాడిన పాట అందులో ఉంటుందో లేదో చెప్పలేం. పరిస్థితులను బట్టి ఏమైనా జరగొచ్చు. అందుకే.. మంచి సినిమాలకే పాడుతున్నాను అని మాత్రం చెప్పగలను.
 
ఇలాంటివి కూడా జరుగుతాయా?
అంటే... ఇక్కడ ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. ఒకసారి రికార్డ్ చేసిన పాటను ఆల్బమ్ నుంచి తప్పించడానికి ఎన్నో కారణాలుంటాయి.
 
సరే... గాయనిగా మీకు దక్కిన గొప్ప ప్రశంస?
నేటి జనరేషన్‌లో ప్రణవి పాటంటే నాకిష్టం అని ఓ సందర్భంలో కీరవాణి అన్నారు. అలాగే... చిత్రగారు కూడా నా పాటను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. అక్కినేని జాతీయ అవార్డు అందుకోవడానికి లతా మంగేష్కర్‌గారు ఇక్కడకు వచ్చినపుడు, ఆమె ముందు పాడే అవకాశం నాకు వచ్చింది. నా పాట విని లతాజీ ‘బహుత్ అచ్చాహై’ అని మెచ్చుకున్నారు.
 
అసలు గానం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?
మా అమ్మ వీణ వాయిస్తారు. పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. నాకు స్వరజ్ఞానం అమ్మ నుంచే అబ్బింది. నాన్న తెలుగు టీచర్. అలాగే... మంచి కళాకారుడు కూడా. బాపుగారి వద్ద కూడా పనిచేశారు. వీరిద్దరే నా తొలి గురువులు. నాలోని స్వరజ్ఞానం గమనించి... వారే నాకు సంగీతం నేర్పించారు.
 
తొలి అవకాశం ఎలా వచ్చింది?
నేను తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుని. ఇప్పటికి మూడొందల సినిమాల పైచిలుకు డబ్బింగ్ చెప్పాను. సినిమాల్లో చైల్డ్ కారెక్టర్లకు చెప్పేదాన్ని. ‘అతడు’ సినిమాలో త్రిష ఫ్రెండ్ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ‘నేను పార్దూ.. నీ పద్దూని’ అనే డైలాగ్ నేను చెప్పిందే. చిన్న డైలాగే అయినా... అది చాలా పాపులర్. అలాగే కళంకిత, అంతరంగాలు, శివలీలలు తదితర సీరియల్స్‌లో కూడా కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. కెమెరామేన్ సంతోష్‌శివన్‌గారు హిందీ, తెలుగు భాషల్లో తీసిన ‘హలో’ సినిమా తెలుగు వెర్షన్‌కి తొలిసారి పాడాను. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. ఆ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్యగారి ద్వారా కల్యాణ్‌మాలిక్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ‘ఆంధ్రుడు’ సినిమాలో ఓ శ్లోకం పాడాను.
 
పేరు తెచ్చిన పాటలు?
‘ఛత్రపతి’ సినిమా కోసం నాతో హమ్మింగ్స్ పాడిం చారు ఎం.ఎం.కీరవాణి. ఆ తర్వాత ఆయనే... ‘శ్రీరామదాసు’ సినిమా కోసం ‘శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా...’ పాట ట్రాక్ పాడించారు. ఆ పాట శ్రేయాఘోషల్ పాడాలి. కానీ నా పాట నచ్చి ఉంచేశారు. నాకు మంచి పేరు తెచ్చిన పాట అది. ఇంకా ‘యమదొంగ’లోని ‘రబ్బరు గాజులు’, ‘యంగ్ యమ’, ‘నువ్వు ముట్టుకుంటేనే’ పాటలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కీరవాణిగారు నాకందించిన ప్రోత్సాహం నిజంగా చాలా గొప్పది.
 
మరి ఆర్టిస్టుగా ఎందుకు ప్రయత్నించలేదు?
చిన్నప్పుడు ‘హిట్లర్’ సినిమాలో నటించాను. కొన్ని ప్రైవేటు యాడ్స్‌లో కూడా చేశాను. అయితే.. మా ఇంట్లో ఎవరికీ నటనపై ఆసక్తి లేదు. అందుకే అటువైపు చూడలేదు.
 
ఇంతకూ మీ పెళ్లెప్పుడు?
దానికి టైమ్ ఉంది. అమ్మానాన్న చూపించిన అబ్బాయితోనే తాళి కట్టించుకుంటా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement