లక్కు మారుతుందా?
ఆశలు, కోరికలు మనిషికి సహజం. అయితే అవి తీరడానికి చేసే ప్రయత్నమే ప్రధానం. అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ రెండోదే కలిసి రాని నటిగా మారారు ప్రణీత. ఈ కన్నడ భామ మంచి అందగత్తే. నటిగా కూడా పెద్దగా కొరతలూ లేవు. లేనిదల్లా లక్కే...ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇది అస్సలు లేదు ప్రణీతకు. ఉదయన్ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలో ఏన్నో ఆశలతో రంగప్రవేశం చేసిన నటి ప్రణీత. అరుళ్‌నిధి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ప్రణీతకు బోలెడంత నిరాశ.
చిన్న గ్యాప్ తరువాత కార్తీతో శకుని చిత్రంలో రొమాన్స్ చేసి అవకాశం రావడంతో ప్రణీతలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే శకుని అపజయంతో ఈ బ్యూటీ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. మళ్లీ అవకాశాలు నిల్. కొంతగ్యాప్ తరువాత మాస్ చిత్రంలో సూర్యతో నటించే అవకాశం వచ్చింది. రెండో నాయకి పాత్ర అయినా టాప్ హీరో సరసన కావడంతో మంచి ప్రచారం వస్తుంది. తద్వారా అవకాశాలు రాబట్టుకోవచ్చన్న చిన్న ఆశతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు.
నిజానికి ఆ పాత్రను శ్రుతీహాసన్ చేయాల్సింది. ప్రాధాన్యత లేదని తను ఆ చిత్రం నుంచే వైదొలగారు. మాస్ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. మళ్లీ ప్రణీత కథ మొదటికి వచ్చింది. అంతే కాదు లక్కు లేని నటి అనే ముద్రకు గురయ్యారు. అయితే తాజాగా నటుడు జై తో నటించే అవకాశం వచ్చింది. ఎనక్కు వాయ్oద అడిమైగళ్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇంతకు ముందు చిత్రాలలో అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిన ప్రణీత ఈ చిత్రంలో కాస్త డోస్ తగ్గించి నటిస్తున్నారట.
అభినయానికి ప్రాధాన్యతనిస్తూ, సంభాషణలు బట్టీ పట్టి, రిహార్సల్ చేసి మరీ కెమెరా ముందుకు వెళుతున్నారట. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు ఓకే అన్నా తనకు తృప్తి కలగలేదంటూ మరో టేక్ తీసుకుని మరీ నటిస్తున్నారట. ఈ చిత్రంతో లక్కు లేని నటి అన్న ముద్రను తుడిచేస్తుందని, తానూ కోలీవుడ్‌లో ప్రముఖ నాయకిగా పేరు తెచ్చుకుంటాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.