పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్!
హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఏ సినిమాలో ఎలా కనిపించినా... పూరి సినిమాల్లో మాత్రం హీరోలు పెక్యులర్‌గా కనిపిస్తారు. భిన్నంగా బిహేవ్ చేస్తారు. ప్రతి టాలీవుడ్ స్టార్... పూరీతో పనిచేయడానికి ఉవ్విళ్లూరేది అందుకే. పూరి కెరీర్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైన సినిమా అంటే... టక్కున గుర్తొచ్చేది ‘ఆంధ్రావాలా’. విడుదలకు ముందు ఆ సినిమాకు వచ్చిన హైప్ అంతాఇంతా కాదు. నిమ్మకూరులో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ నేటికీ ఓ రికార్డే. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేసిన సినిమా అవ్వడంతో... ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అయితే... ఆ స్థాయి అంచనాలను ‘ఆంధ్రావాలా’ అందుకోలేకపోయింది.
ఇది పదేళ్ల నాటి మాట. అప్పట్నుంచీ విడివిడిగా తారక్, పూరి ఎన్ని విజయాలను అందుకున్నా... ఇద్దరూ కలిసి ఓ హిట్ ఇవ్వా లనే కోరిక మాత్రం కలగానే మిగిలిపోయింది. అయితే... ఆ కల నిజం చేసే పనిలో ఉన్నారు పూరి జగన్నాథ్. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత పూరి చేయబోయే సినిమా ఏంటి? అనే విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఆగడు’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మహేశ్ పూరి జగన్నాథ్ సినిమా చేస్తారట. అయితే... ‘ఆగడు’ పూర్తవ్వడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ఈ గ్యాప్‌లో... తారక్‌తో ఓ సినిమా చేయడానికి పూరి ప్లాన్ చేస్తున్నారని వినికిడి. సినిమాను యమ స్పీడ్‌గా పూర్తి చేసే పూరి... ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.