టైటిల్ : 2.ఓ
జానర్ : సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం : శంకర్
నిర్మాత : సుభాస్కరణ్
ఒకవైపు ఇండియా గర్వించదగ్గ దర్శకుడు శంకర్. మరోవైపు ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇంకోవైపు వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. సక్సెస్‌లో ఉన్న నార్త్ స్టార్ అక్షయ్‌కుమార్. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్ సిస్టమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో వస్తోన్న చిత్రం ‘2.ఓ’. మామూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు. ఇక శంకర్ కాంబినేషన్‌లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రోబోకు సీక్వెల్‌గా ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలను అందుకుందా? బాహుబలి రికార్డులను చిట్టి బద్దలుకొట్టనున్నాడా? శంకర్ మరోసారి తన విజన్‌తో మ్యాజిక్ చేశాడా?.. ఇవన్ని తెలియాలంటే ఓ సారి కథలోకి వెళ్దాం..
కథ
హఠాత్తుగా నగరంలోని సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్స్ అన్ని కలిసి ఓ సెల్ ఫోన్ వ్యాపారిని, ఓ మొబైల్ నెట్‌వర్క్ ఓనర్‌ని దారుణంగా హత్య చేస్తాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొవటానికి ప్రభుత్వం ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. మిలటరీ సాయంతో సెల్‌ఫోన్ దాడిని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించదు. (సాక్షి రివ్యూస్) డా.వసీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. తిరిగి ప్రాణం పోసుకున్న చిట్టి సాయంతో ఈ విధ్వంసానికి కారణం చనిపోయిన పక్షిరాజా అని తెలుసుకోని ఆ నెగెటివ్ ఎనర్జీని బంధించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వసీకరణ్ విజయం సాధించాడా..? అసలు పక్షిరాజా సెల్‌ఫోన్స్‌ను ఎందుకు మాయం చేస్తున్నాడు.? ఎందుకు హత్యలు చేస్తున్నాడు..? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్ వసీకరణ్, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది. ముఖ్యంగా 2.ఓగా రజనీ మేనరిజమ్స్‌కు థియేటర్‌లో విజిల్స్ పడతాయి. ఈ వయసులో రజనీ చూపించిన డెడికేషన్ తెర మీద కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌లోనూ రజనీ సూపర్బ్ అనిపించారు. (సాక్షి రివ్యూస్) ఇక అక్షయ్‌కుమార్ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ సాధారణ ప్రోఫెసర్ సమాజాన్ని పక్షి జాతిని కాపాడేందుకు పడే వేదనను ఆయన అద్భుతంగా పలికించారు. భారీ ప్రోస్తటిక్ మేకప్‌లోనూ అద్భుతమైన నటనతో ఆకట్టకున్నారు. అంత భారీ సూట్, మేకప్ తో నటించిన అక్షయ్ కష్టం సినిమాకు చాలా పస్ల్ అయ్యింది. అక్షయ్ నటనలోని మరోకోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. రోబో వెన్నెలగా అమీ జాక్సన్ తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. యాక్షన్ సీన్స్‌లోనూ అలరించింది. ఇతర పాత్రల్లో సుధాన్షు పాండే, ఆదిల్ హుస్సేన్, కళాభవన్ షాజోన్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
విశ్లేషణ
శంకర్ తన సినిమాను సామాజిక సమస్యలు, సందేశాత్మక అంశాలను జోడించి తెరకెక్కిస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ శంకర్ తీసిన సినిమాలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు బాగుంది. సెల్‌ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అన్న అంశాలను భారీగా తెరకెక్కించారు. (సాక్షి రివ్యూస్) విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సినిమాలో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పదాలు వాడటంతో అవి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. తొలి భాగం అంతా సెల్‌ఫోన్స్ మాయం కావటం, అందుకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం, వసీకరణ్ చేసే ప్రయత్నాలతో సరిపెట్టేసిన దర్శకుడు అసలు కథ, మలుపులను ద్వితీయార్థంలోనే చూపించాడు.
పక్షిరాజా ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సుదీర్ఘ క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులు కన్నార్పకుండా చూసే భారీ విజువల్ గ్రాఫిక్స్‌తో అలరిస్తుంది. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్‌లో రజనీ మేనరిజమ్స్, అక్షయ్ లుక్ కనిపించినా పూర్తిగా గ్రాఫిక్స్‌లో రూపొందించిన పాత్రలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ మ్యూజిక్. ఇలాంటి కమర్షియల్ సినిమాలో పాటలు లేకుండా రూపొదించటం సాహసం అనే చెప్పాలి. అయితే ఆ లోటును నేపథ్యం సంగీతంతో తీర్చారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. రసూల్, రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్‌ను కథలో లీనమయ్యేలా చేస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా.. ఇండియన్ సినిమాలో 4డీ సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్ తీసుకెళ్లారు. నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమాలో ఏది గ్రాఫిక్స్ ఏది నిజమన్న విషయాన్ని చాలా సన్నివేశాల్లో గుర్తించటం కూడా కష్టమే అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫి. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
గ్రాఫిక్స్
రజనీ, అక్షయ్‌ల నటన
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సగటు ప్రేక్షకుడికి అర్ధం కాని సాంకేతిక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment