
జూలైలో... కబాలి?
పంచ్ డైలాగ్స్ రజనీకాంత్ చెబితే ఆ కిక్కే వేరప్పా! ఆయన చెప్పిన ఆ తరహా సంభాషణల్లో ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా’ ఒకటి. ఇప్పుడా డైలాగ్‌ని గుర్తు చేయడానికి కారణం ‘కబాలి’ విడుదల కాస్తంత వెనక్కి వెళ్ళడమే! రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌లో తెర పైకి వస్తుందన్నారు. కాగా, రిలీజ్ మరో నెల వాయిదా పడిందని సమాచారం.
జూలై 1న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. నిర్మాణానంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం పట్టడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. రజనీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో తైవానీస్ నటుడు విన్‌స్టన్ చౌ విలన్‌గా నటించారు. ఇందులో తాను చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆయన చెన్నై చేరుకున్నారు. ఇప్పటికే రజనీ లుక్ ఒక చర్చనీయాంశమైతే, ఇటీవల విడుదలైన టీజర్ కోట్లల్లో వ్యూస్ దక్కించుకొని, చిత్రంపై భారీ అంచనాలు పెంచింది. రజనీ అభిమానులు, ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా ‘కబాలి’ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందుతున్న రోబో సీక్వెల్ ‘2.0’లో విలన్‌గా నటిస్తున్న అక్షయ్‌కుమార్ అయితే, ఈ టీజర్ చూసి ముగ్ధులైపోయారు. విడుదలైన మొదటి రోజు, మొదటి షోనే ‘కబాలి‘ని చూడాలనుకుంటున్నట్లు చెప్పేశారు. టీజర్ అంత ఆసక్తికరంగా అనిపించిందన్నారు. మొత్తానికి, తాజా ‘కబాలి’ కూడా గతంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ‘బాషా’ స్థాయిలోనో, అంతకు మించో విజయవంతమవుతుందని అంచనాలు ఉన్నాయి.