తమిళసినిమా: ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు ఇక సినిమాల పండగే. ఒకవైపు రజనీ రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆయన సినిమాలు వరుసబెట్టి వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సూపర్‌స్టార్ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరిపించేందుకు వరుసగా రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో భారీ చిత్రం 2.వో.. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక, రజనీ మరో చిత్రం ‘పేట’ కూడా వెనువెంటనే వచ్చేందుదకు సిద్ధమవుతోంది.
యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకి జంటగా నటి త్రిష, సిమ్రాన్ నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది. ఈ చిత్ర సింగిల్ ట్రాక్‌ను డిసెంబర్ 3న, రెండో సింగిల్ ట్రాక్‌ను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న ఆడియో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుందని గతంలో చిత్రవర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. పేట పొంగల్‌కు రావడం ఖాయమని తాజాగా కార్తీక్‌సుబ్బరాజు స్పష్టం చేశారు. 2.వో శంకర్ స్టైల్ విజువల్ ట్రీట్ అయితే పేట రజనీ స్టైల్ ట్రీట్‌గా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తానికి రజనీ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్ వరకు పండగే పండగన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment