
సూపర్‌స్టార్‌తో కార్తీక్ సుబ్బరాజ్, నిర్మాత దయానిధిమారన్
తమిళసినిమా: దేనికైనా లక్కు ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి అదృష్టం ఎప్పుడు? ఎవరిని పడుతుందో ఊహించడం కష్టం. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చేయాలని ఆశపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పత్రి నటీనటుడికి, దర్శక నిర్మాతలకు అలాంటి కోరిక ఉంటుంది. ఇక వర్ధమాన దర్శకులకైతే అదో కలనే చెప్పవచ్చు. కే.బాలచందర్, ఎస్పీ.ముత్తురామన్ లాంటి సీనియర్ దర్శకుల నుంచి శంకర్ వంటి స్టార్ దర్శకుల చిత్రాల్లో నటించిన రజనీకాంత్ ఇటీవల అనూహ్యంగా వర్ధమాన దర్శకులపై దృష్టిసారిస్తున్నారని చెప్పవచ్చు.
రెండు చిత్రాలనే చేసిన దర్శకుడు పా.రంజిత్‌కు అవకాశం ఇచ్చి కబాలి చిత్రంలో నటించి ఆశ్చర్యపరచిన సూపర్‌స్టార్ మళ్లీ వెంటనే కాలా చిత్రానికి ఆయన్నే ఎంచుకోవడం విశేషమే. కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అంతకు ముందు చిత్ర టీజర్‌ను మార్చి ఒకటో తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో నటించిన 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాట్ నెక్ట్స్ అన్న ప్రశ్న తలెత్తినప్పుడు రజనీకాంత్ దృష్టిలో రెండు మార్గాలు కదలాడుతున్నాయి.
అందులో ఒకటి రాజకీయరంగప్రవేశం. ఇందుకు ఇప్పటికే తెరవెనుక పనులు వేగంగా జరగుతున్నాయి. ఈ లోగా ఒక మంచి రాజకీయనేపథ్యంలో చిత్రం చేయాలన్నది సూపర్‌స్టార్ బలమైన భావన. అందుకు పావులను కదుపుతూ వచ్చారు. ఇందుకు కారణం లేకపోలేదు. మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశంచే ముందు ఈ తరహా చిత్రాలు చాలానే చేసి ప్రజల మనసులను దోచుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఆ తారకమంత్రాన్నే పఠించాలనుకుంటున్నారు.
ఈయన ఆలోచనలకు తగ్గట్టుగా పలువురు కథలను రెడీ చేసుకుంటున్నారు. సమయం లేదు మిత్రమా అన్న చందాన సూపర్‌స్టార్‌తో ఒక్క చిత్రం అయినా చేసి తీరాలన్న తపనతో కథలను తయారు చేసుకున్న దర్శకుల్లో కేవీ.ఆనంద్, అట్లీ, మణికంఠన్ లాంటి దర్శకులు ఉన్నారు. వీరందరూ రజనీని కలిసి కథలను వినిపించినవారే. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ప్రచారం జోరుగానే జరిగింది.
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురికే కాదు ఆయనతో ఒక్క చిత్రం అయినా చేయాలని కలలు కంటున్న చాలా మందికి సూపర్‌స్టార్ షాక్ ఇచ్చేలా మరో యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌కు అవకాశం కల్పించారు. ఎస్. సూపర్‌స్టార్ బాల్ ఈ యువ దర్శకుడు కోర్టులో పడింది. ఈయన కథ రజనీకాంత్ రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందట. తొలి చిత్రం పిజ్జా తోనే విజయాన్ని తనవైపునకు తిప్పుకున్న ఈ దర్శకుడు జిగర్‌తండా చిత్రంతో తమిళసినిమానే తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నారు.
అయితే ఆ తరువాత ఇరవి అంటూ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా మెర్కురి చిత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌తో చిత్రం చేసే అదృష్టం కలిసొచ్చింది. ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను శుక్రవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా ఎందిరన్ వంటి బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థనే అన్నది గమనార్హం. అయితే ఈ తాజా చిత్రం ఎప్పుడు సెట్‌పైకి వెళ్లేది ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment