పట్న(బిహర్) : పద్మావతి చిత్ర వివాదం పూటపూటకి వేడిని మరింతగా రాజేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్‌పై దీపిక పడుకొనేపై రాజ్‌పుత్ కర్ణి సేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మండిపడ్డారు. పట్నలో మీడియాతో మాట్లాడిన ఆయన దీపిక తాజాగా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
‘‘రాణి పద్మావతిని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేయసిగా చూపించటాన్ని ఎవరు భరిస్తారు? చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదలై తీరుతుందని దీపిక చెబుతోంది. ఆమె మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయే తప్ప.. ఆలోచనా ధోరణితో లేవు. ఆమె ఏం ఈ దేశానికి అధినేత కాదు. ఆదేశాలు చేయటానికి ఏమైనా తోపు అనుకుంటుందా?. రాజ్‌పుత్ కర్ణి సేన అధినేతగా చెబుతున్నా ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాబోదు’’ అని లోకేంద్ర పేర్కొన్నారు.
రాణి పద్మావతి తమకు తల్లి లాంటిదని... అలాంటి మహనీయురాలి పేరును చెడగొట్టేందుకు దర్శకుడు భన్సాలీ ప్రయత్నిస్తున్నాడని లోకేంద్ర తెలిపారు. ఆ ఘోరాన్ని తాము భరించలేమని ఆయన అంటున్నారు. ఒక్క రాజ్‌పుత్ మాత్రమే కాదు.. ఈ సినిమాను అడ్డుకునేందుకు యావత్ భారత సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లోకేంద్ర సింగ్ ప్రస్తావించారు.
కాగా, సినిమా విషయంలో జోక్యం చేసుకోవటానికి రాజ్‌పుత్ కర్ణి సేన ఎవరని? అందుకు సెన్సార్ బోర్డు ఉందని దీపిక వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహం చెందిన సేన సభ్యుడొకరు ఆమె ముక్కును కోసేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment