
1985లోని ఓ పల్లెటూరి ప్రేమకథ...రంగస్థలం
ఈ ప్రపంచమే ఓ రంగస్థలం. అందులో మనుషులంతా పాత్రధారులే. ఎవరి పాత్రలో (జీవితంలో) వాళ్లు నటిస్తుంటారని అన్నారో కవి. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా ఈ మాటే అంటున్నారు. ఆయన ఊహా ప్రపంచాన్ని ‘రంగస్థలం’గా అభివర్ణించారు. ఇందులో రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పాత్రధారులు.
ఇంకా అర్థం కాలేదా? రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ (సీవీయం) నిర్మిస్తున్న సినిమాకు ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. 1985... అనేది ఉపశీర్షిక. 1985 కాలంనాటి కథతో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిదని సమాచారం. ‘‘ఇప్పటివరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. వినూత్న కథతో, ప్రేక్షకులను అలరించే వాణిజ్య హంగులతో సుకుమార్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.