
నీలాంబరి రీఎంట్రీ
రజనీకాంత్ నటించిన పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్రను అంత సులభంగా ఎవరూ మరచిపోరు. ఆ పాత్రలో రమ్యకృష్ణ జీవించారంటే అతిశయోక్తి కాదు. నీలాంబరిలోని ద్వేషం, పగ, పశ్చాత్తాపానికి తావులేని ప్రతీకారేచ్ఛను తన ముఖ కవళికలో అద్భుతంగా పండించిన రమ్యకృష్ణ తమిళంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలోను నీలాంబరిగా ముద్ర వేసుకున్నారు. అలాంటి నటి ఇటీవల తమిళ సినిమాకు దూరమయ్యారు. తాజాగా ఈ అభినయతార, కోలీవుడ్‌లో రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంబళైలో రమ్యకృష్ణ ముఖ్య భూమికను పోషించనున్నారన్నది తాజా సమాచారం. విశాల్ హీరోగా నటిస్తున్న పూజై చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్. విశాల్ తదుపరి చిత్రానికి తయారయ్యారు. సుందర్.సి దర్శకత్వంలో ఆంభళై చిత్రంలో నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామ హన్సిక హీరోయిన్. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కోసం త్వరలో హైదరాబాద్‌కు చిత్ర యూనిట్ పయనం కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించనున్నట్లు దర్శకుడు సుందర్.సి వెల్లడించారు. అయితే ఆమె పాత్ర గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడదలచుకోలేదని అన్నారాయన. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మరో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.