చరణ్ బెస్ట్ ఫ్రెండే విలన్..?
ప్రస్తుతం బ్రూస్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ తన తదుపరి సినిమాను కూడా ఫైనల్ చేశాడు. ఇప్పటికే చరణ్ కోసం డివివి దానయ్య రూ. 5.5 కోట్లు ఖర్చుపెట్టి తనీఒరువన్ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది. అయితే తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామి రీమేక్ లో ఆ పాత్ర ఆసక్తి చూపించకపోవటంతో ఇప్పుడు ఆ పాత్ర లో నటించే నటుడి కోసం టాలీవుడ్లో వేట మొదలైంది.
ఈ సినిమాలో హీరో పాత్రకు ఉన్నంత ప్రాముఖ్యం విలన్ పాత్రకు కూడా ఉండటంతో ఆ పాత్రలోనూ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే మంచిదని భావిస్తున్నారు. అందుకే యంగ్ హీరో రానాను ఈ పాత్రలో నటింపజేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే బాహుబలి సినిమాలో విలన్గా నటిస్తున్న రానా, తనీఒరువన్ రీమేక్లో కూడా ఆ తరహా పాత్ర చేస్తాడేమో చూడాలి.
క్యారెక్టర్ కోసం కాకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ చరణ్ కోసం అయినా రానా అంగీకరిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్గా అందరికీ తెలిసిన ఈ ఇద్దరు స్టార్లు వెండితెర మీద పోటా పోటీగా నటిస్తే అది మార్కెట్కు కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రానా ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి.