విలన్గా మన్మథుడు..?
స్టార్ హీరోగా ఇమేజ్ కాపాడుకుంటూనే.. ప్రయోగాలకు కూడా రెడీ అంటున్నాడు సీనియర్ హీరో నాగార్జున. మన్మథుడిగా మంచి ఫాంలో ఉన్న సమయంలో అన్నమయ్యగా, శ్రీరామదాసుగా ఆకట్టుకున్నాడు నాగ్. ఇప్పుడు కూడా అదే జోరు చూపిస్తూ వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు.
కోలీవుడ్లో సంచలన విజయం సాధించిన తనీఒరువన్ తెలుగు రీమేక్కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరో పాత్రకు సమానంగా ప్రాధాన్యం ఉన్న విలన్ పాత్ర కోసం కూడా భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పటికే రానా, నారా రోహిత్, సోనూసూద్ లాంటి పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాగ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టుగా సమాచారం.
నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాల్లో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఆత్మగా కనిపిస్తున్న కింగ్, ఊపిరి సినిమాలో వీల్చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ జనరేషన్ హవా చూపిస్తున్న తరుణంలో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన స్టార్డంను కాపాడుకుంటూ వస్తున్నాడు నాగార్జున.