రణ్‌బీర్ ఓకే అంటే పెళ్లికి సై..
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌పై నటి అలియా భట్ మోజుపడింది. అతనంతే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఓకే అంటే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. సినీ నిర్మాత కరణ్ జోహర్‌తో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో రణ్‌బీర్ కపూర్‌పై అలియా భట్ ప్రశంసలు కురిపించింది. రాక్‌స్టార్ సినిమాలో తొలిసారి రణ్‌బీర్‌తో కలిసి నటించినప్పుడు సరదాగా గడిచిపోయిందని తెలిపింది. ఆ తర్వాతే రణ్‌బీర్ అంటే ఎంతో అభిమానం పెరిగిందని చెప్పింది. ఇప్పటికీ రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని వెల్లడించింది.
రణ్‌బీర్ కపూర్ నటన బాగుంటుందని, ఆయన సహ నటులందరినీ కలుపుకొని ముందుకు వెళతాడని పొగడ్తలతో ముంచెత్తింది. సినిమాలో నటనపరంగానే కాక బయట జీవితంలోనూ రణ్‌బీర్ ఉండే విధానం తనకు ఎంతగానో నచ్చిందని వివరించింది. రణ్‌బీర్‌తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది. సినీ పరిశ్రమలో రణ్‌బీర్ గురించి తప్ప ఎవరి గురించి అడిగినా చలాకీగా సమాధానం చెబుతానంది. తాను నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా సహనటులు వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు ఎప్పుడూ సరదాగా ఆట పట్టించేవారని తెలిపింది. మరో నటుడు అర్జున్ కపూర్‌తో ఎఫైర్ ఉందన్న వార్తలను అలియా కొట్టిపారేసింది. రణ్‌వీర్ సింగ్ వెరైటీగా నటించేందుకు ప్రయత్నిస్తాడని, ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తాడని, మరికొన్ని సందర్భాల్లో చాలా కూల్‌గా ఉన్నట్టు కనిపిస్తాడని తెలిపింది.