
దారి తప్పిన హీరోయిన్
నెల్లూరు, సిటీ: జిల్ ఫేమ్ రాశిఖన్నా సోమవారం నెల్లూరులోని ఓ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళుతూ కారు డ్రైవర్ తప్పిదంతో దారి తప్పడం వల్ల ఆలస్యంగా హాజరైందని సమాచారం. నగరంలోని లాట్ మొబైల్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. హీరోయిన్ రాశిఖన్నా ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించాల్సి ఉంది.
ఇందుకోసం రాశి హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన కారులో నెల్లూరుకు పయనమైంది. అయితే, డ్రైవర్ పొరపాటున నెల్లూరు వైపునకు బదులు వేలూరు వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో 11.45 నిమిషాలకు షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరు కావాల్సి ఉండగా 2 గంటలకు వచ్చారు. ఈ విషయాన్ని షోరూమ్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది.