కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.
విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్ ప్లేట్‌లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment