అమర్‌నాథ్ ధామ్ యాత్ర అంత్యంత వైభవంగా జూన్ 29న ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అమర్‌నాథ్ యాత్రా మార్గంలో ప్రతీయేటా మూడు నుంచి నాలుగు వందల టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించనుంది.
ఒకవైపు అమర్‌నాథ్ యాత్ర జరుగుతుండగానే మరోవైపు ఈ మార్గంలో చెత్తను పారవేసే ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులు సేవలు అందించనున్నారు. యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్తవేసుకునే కిట్ అందించనున్నారు.
యాత్రా మార్గంలో వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్, లంగర్, గుహ వరకు వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.
అమర్‌నాథ్ యాత్రా మార్గంలో 2850 మరుగుదొడ్లు, 516 స్నాన ఘాట్‌లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంప్‌లలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె బిర్డి తాజాగా అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశమైన చందన్‌వాడిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీఎపీఎఫ్ అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment