ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను!
ప్రతిభ, అదృష్టం... ఈ రెండూ తోడైతే నాని. ప్రస్తుత పరిస్థితుల్లో గాడ్‌ఫాదర్ లేకుండా సినీరంగంలో ఎదగడం తేలికైన విషయం కాదు. కానీ, నాని ఎదిగి చూపించాడు. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా టర్న్ తీసుకొని, ఇప్పుడు నిర్మాత స్థాయికి చేరుకున్నాడు. ‘‘నేనింకా చేరుకోవాల్సిన విజయ తీరాలు చాలా ఉన్నాయి’’ అంటున్నారు నాని. సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె.లతో కలిసి నాని నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నానితో జరిపిన సంభాషణ.
ఉన్నట్టుండి నిర్మాతగా మారారేంటి?
వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశాను. ఆసక్తికరంగా అనిపించాయి. మొత్తం సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ టీమ్‌లో నేనూ ఒకణ్ణి ఎందుకు కాలేకపోయానా అనిపించింది. అనుకోకుండా ఈ సినిమా నిర్మాతలు నన్ను కూడా వారి టీమ్‌లోకి ఆహ్వానించారు. అలా నిర్మాతల్లో నేనూ ఒకణ్ణి అయిపోయాను.
ఇక ముందు కూడా నిర్మాతగా కొనసాగుతారా?
సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకూ జరిగే ప్రాసెస్ అంతా నాకు తెలుసు. అయితే... ఆ తర్వాత జరిగే ప్రాసెస్ నాకు తెలీదు. నిర్మాతగా మారాక, ఇప్పుడు తెలుస్తోంది. సినిమా పూర్తవ్వడం ఒక ఎత్తయితే... దాన్ని థియేటర్లకు పంపడం ఒక ఎత్తు అని. ఈ అనుభవం నిర్మాతగా కొనసాగడానికే ఉపయోగపడుతుందంటే నేనొప్పుకోను. నటుడికి కూడా అవసరమే.
మరి మీ ‘పైసా’ సినిమా విడుదల విషయంలో కూడా ఇలాగే సహకరించొచ్చుగా? నేను ‘పైసా’ లాంటి సినిమాలో హీరోగా చేసే స్థాయికి ఎదిగానేమో కానీ, ‘పైసా’ లాంటి సినిమాను నిర్మించే స్థాయికి ఎదగలేదు. అది చాలా పెద్ద సినిమా.
ఇంతకీ ‘పైసా’ విడుదల ఎప్పుడు?
త్వరలోనే. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం మాత్రం ఖాయం. నేను కృష్ణవంశీగారి అభిమానిని. కానీ.. ‘పైసా’ నిర్మాణం టైమ్‌లో ఆయనతో చాలా విషయాల్లో వాదన పెట్టుకునేవాణ్ణి. అందులో కొన్ని సీన్స్, ఇందులో కొన్ని సీన్స్ తీసుకుని సినిమా తయారు చేస్తున్నారని ఏవేవో అనేశాను. కానీ.. సినిమా మొత్తం చూశాక తెలిసింది కృష్ణవంశీగారంటే ఏంటో. నేను నమ్మకంగా చెప్పేదొక్కటే. కృష్ణవంశీగారి కెరీర్‌లో ‘ఖడ్గం’ ఎంత గొప్ప సినిమానో, ఇదీ అంతటి గొప్ప సినిమా.
మీ ద్వారా యశ్‌రాజ్ సంస్థ దక్షిణాదికి ప్రవేశించడం ఎలా ఉంది?
ఈ సినిమాకు ‘ఆహా కళ్యాణం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పనిమీద ముంబయ్‌లోని యశ్‌రాజ్ స్టూడియోకి వెళ్లాను. అక్కడ వరుసగా మేకప్ రూమ్స్‌పై షారుఖ్ అనీ, సల్మాన్ అనీ, ఆమిర్ అనీ, దీపికా పదుకొనే అనీ... ఇలా ఆర్టిస్టుల పేర్లు రాసున్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్తుంటే చివర్లో ‘నాని’ అని నా పేరు రాసుంది. తమ సంస్థలో నటించిన హీరోల ఫొటోలను కూడా వారు వరుసగా అమర్చారు. వాటిలో నా ఫొటో కూడా ఉంది. ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘ఆహా కల్యాణం’ దర్శకుడు గోకుల్ తమిళుడవ్వడంతో ఈ సినిమాను తమిళంలోనే తెరకెక్కించారు. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం తెలుగులో రీషూట్ చేశారు. కానీ ఆర్టిస్టులు మాత్రం దాదాపుగా అందరూ కొత్తవారే. శేఖర్‌కమ్ముల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వాణీకపూర్ కథానాయిక.
‘బ్యాండ్ బాజా బారత్’ రీమేక్ కదా. మరి ఇందులో లిప్ లాక్‌లు ఉంటాయా?
అంతా ఇప్పుడే చెప్పేస్తే ఎలా. ఆ సినిమా గురించి మాట్లాడే రోజులు ముందున్నాయి. లిప్ లాక్‌లు ఎన్ని ఉన్నాయి? అవి ఎంత సేపు ఉంటాయి? అవన్నీ అప్పుడు చెబుతా (నవ్వుతూ).
కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా?
మా అక్కయ్య యూఎస్‌లో ఉంటోంది. తన దగ్గరకు వెళ్లాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు. ఈసారి అక్కడే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటా. ఇరవై రోజుల్లో తిరిగొచ్చాక... అప్పుడు కొత్త సినిమాల గురించి ఆలోచిస్తా.
మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా?
ఎందుకు చేయను. కాకపోతే.. మల్టీస్టారర్స్ అంటే ఇక్కడ పాత్రల పరిధుల్నే చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పాత్రలు సమానంగా ఉండనక్కర్లేదు. ఓ పాత్ర తక్కువగా ఉన్నా... అది కథను ప్రభావితం చేసేలా ఉంటే చాలు, అదే గొప్ప మల్టీస్టారర్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతోంది అదే. పెద్ద పెద్ద హీరోలే అక్కడ అలా వచ్చి ఇలా మాయమయ్యే పాత్రలు చేస్తున్నారు. అలాంటి మంచి కథ దొరికితే... మల్టీస్టారర్ చేయడానికి నేను రెడీ.
కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా. వైవాహిక జీవితం ఎలా ఉంది?
పెళ్లి విషయంలో లేట్ చేయకుండా 27 ఏళ్లకే చేసేసుకున్నా. అందుకే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంది. పిల్లల్ని ఇప్పుడే వద్దనుకుంటున్నాం. దానికి కాస్త టైమ్ కావాలి.