సినిమా రివ్యూ: డి ఫర్ దోపిడి
సినిమా రివ్యూ: డి ఫర్ దోపిడి
Published Wed, Dec 25 2013 1:29 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
చిత్రం: ఢి ఫర్ దోపిడి
తారాగణం: వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేశ్, మెలానీ కన్నోకాడా, తనికెళ్ల భరణి, దేవా కట్టా
మ్యూజిక్: మహేశ్ శంకర్
సినిమాట్రోగ్రఫి: లుకాస్
ఎడిటింగ్: ధర్నేంద్ర
నిర్మాతలు: రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె, నానీ
దర్శకుడు సిరాజ్ కల్లా
నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. పలు రకాలుగా ఈజీ మనీ కోసం ప్లాన్ వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి ప్లాన్ వేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో నలుగురు కుర్రాళ్లు ఎలాంటి పరిస్తితిని ఎదుర్కొన్నారు? బ్యాంక్ ను దోపిడి చేయడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు డి ఫర్ దోపిడి తెరపై చూడాల్సిందే.
అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైన విక్కీ కారెక్టర్ లో వరుణ్ సందేశ్, సినీ నటుడిగా మారాలని ఫిలింనగర్ చేరుకున్న రాజు పాత్రలో సందీప్ కిషన్ తోపాటు మామను ఒప్పించి మరదల్ని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉండే హరీష్(నవీన్), నచ్చిన అమ్మాయిని ప్రేమించడానికి సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే బన్ను(రాకేశ్) పాత్రలు డి ఫర్ దోపిడి చిత్రంలో ప్రధానమైనవి. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ.. అప్పులను తీర్చలేక తప్పించుకు తిరిగే యువకులుగా నలుగురు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపించారు. హీరోయిన్ గా మెలానీ కన్నోకాడా గురించి చెప్పుకోవాల్సినంతగా ఏమి లేదు. నలుగురి కుర్రాళ్ల కథలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది.
బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన మరో గ్యాంగ్ కు బాస్ గా తనికెళ్ల భరణి గుర్తుండి పోయే పాత్రలో కనిపించారు. తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ కొంత వినోదాన్ని పండించింది. పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ లో దర్శకుడు దేవా కట్టా ఆకట్టుకున్నాడు. చెవులపిల్లి పాత్రలో రిషి మువ్వ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినా.. కథనంతో సినిమాను రెండు గంటలపాటు ఓకే అనే విధంగా నడిపించాడు. సెకాంఢాఫ్ లో పూర్తిగా బ్యాంక్ లోనే కథంతా నడిపించడం కొంత విసుగు కలిగిస్తుంది. అయితే తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ తో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు.ఇక దోపిడి గురైన బ్యాంక్ ముందు మీడియా చేసే హడావిడిని దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుత మీడియాలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇతర విభాగాలు చిత్ర కథ పరిధి మేరకు పర్వాలేదనింపించారు. ఎలాంటి లాజిక్స్ లేకుండా.. సెలవుల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఆశించే రెగ్యులర్ ఆడియెన్స్ కు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది. ప్రత్యేకంగా థియేటర్ కెళ్లి చూసే చిత్రంగా ఢి ఫర్ దోపిడిని మలచడంలో దర్శకుడు సిరాజ్ కల్లా కొంత తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఢి ఫర్ దోపిడిని నిర్మించిన రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె నానీ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. చివర్లో నానీపై చేసిన షూట్ చేసిన సాంగ్, వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
Advertisement
Advertisement