D for Dopidi
-
ఈ ఇద్దరిలో నానీకి గెస్ట్ ఎవరు?
కంటిన్యూస్‌గా ఏడు హిట్స్‌తో నాని ఫుల్ జోరుగా ఉన్నారు. ఈ సక్సెస్ఫుల్ హీరో డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేస్తుంటే, నాని మాత్రం తనకు తానే డేట్స్ ఇచ్చుకున్నారట. అదేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. నాని నిర్మాతగా మారుతున్నారని సమాచారం. నాలుగేళ్ల క్రితం ‘డి ఫర్ దోపిడి’ సినిమాకి నాని జస్ట్ భాగస్వామిగా వ్యవహరించిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నారని టాక్. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు, ఓ గెస్ట్ రోల్‌కు కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా. ఆల్రెడీ నాని సరసన ‘అలా మొదలైంది’, ‘సెగ’ చిత్రాల్లో నిత్య నటించారు. కాజల్ అగర్వాల్ మాత్రం నటించలేదు. మరి.. నాని హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రంలో ఈ ఇద్దరిలో ఎవరు గెస్ట్ రోల్ చేస్తారు? ఎవరు నాయికగా నటిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ల ప్లేస్‌లో వేరే తారలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. -
మరోసారి నిర్మాతగా..?
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తనలోని మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న ఈ యంగ్ హీరో నిర్మాణ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఢీ ఫర్ దోపిడి సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. డైలాగ్ ఇన్ ద డార్క్ పేరుతో షార్ట్ ఫిలిం తీసిన ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. దేశంలోనే తొలి సారిగా వర్చువల్ ఆడియో టెక్నాలజీతో షార్ట్ ఫిలిం నిర్మించిన ప్రశాంత్, నానికి ఇంట్రస్టింగ్ లైన్ చెప్పి మెప్పించాడట. మరి నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నటిస్తాడో లేదో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
D ఫర్ దోపిడి!
-
D ఫర్ దోపిడి మూవీ టీమ్‌తో చిట్ చాట్
-
సినిమా రివ్యూ: డి ఫర్ దోపిడి
చిత్రం: ఢి ఫర్ దోపిడి తారాగణం: వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేశ్, మెలానీ కన్నోకాడా, తనికెళ్ల భరణి, దేవా కట్టా మ్యూజిక్: మహేశ్ శంకర్ సినిమాట్రోగ్రఫి: లుకాస్ ఎడిటింగ్: ధర్నేంద్ర నిర్మాతలు: రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె, నానీ దర్శకుడు సిరాజ్ కల్లా నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. పలు రకాలుగా ఈజీ మనీ కోసం ప్లాన్ వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి ప్లాన్ వేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో నలుగురు కుర్రాళ్లు ఎలాంటి పరిస్తితిని ఎదుర్కొన్నారు? బ్యాంక్ ను దోపిడి చేయడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు డి ఫర్ దోపిడి తెరపై చూడాల్సిందే. అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైన విక్కీ కారెక్టర్ లో వరుణ్ సందేశ్, సినీ నటుడిగా మారాలని ఫిలింనగర్ చేరుకున్న రాజు పాత్రలో సందీప్ కిషన్ తోపాటు మామను ఒప్పించి మరదల్ని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉండే హరీష్(నవీన్), నచ్చిన అమ్మాయిని ప్రేమించడానికి సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే బన్ను(రాకేశ్) పాత్రలు డి ఫర్ దోపిడి చిత్రంలో ప్రధానమైనవి. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ.. అప్పులను తీర్చలేక తప్పించుకు తిరిగే యువకులుగా నలుగురు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపించారు. హీరోయిన్ గా మెలానీ కన్నోకాడా గురించి చెప్పుకోవాల్సినంతగా ఏమి లేదు. నలుగురి కుర్రాళ్ల కథలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన మరో గ్యాంగ్ కు బాస్ గా తనికెళ్ల భరణి గుర్తుండి పోయే పాత్రలో కనిపించారు. తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ కొంత వినోదాన్ని పండించింది. పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ లో దర్శకుడు దేవా కట్టా ఆకట్టుకున్నాడు. చెవులపిల్లి పాత్రలో రిషి మువ్వ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినా.. కథనంతో సినిమాను రెండు గంటలపాటు ఓకే అనే విధంగా నడిపించాడు. సెకాంఢాఫ్ లో పూర్తిగా బ్యాంక్ లోనే కథంతా నడిపించడం కొంత విసుగు కలిగిస్తుంది. అయితే తనికెళ్ల భరణి ఫ్లాష్ బ్యాక్ తో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు.ఇక దోపిడి గురైన బ్యాంక్ ముందు మీడియా చేసే హడావిడిని దర్శకుడు చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుత మీడియాలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇతర విభాగాలు చిత్ర కథ పరిధి మేరకు పర్వాలేదనింపించారు. ఎలాంటి లాజిక్స్ లేకుండా.. సెలవుల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఆశించే రెగ్యులర్ ఆడియెన్స్ కు ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది. ప్రత్యేకంగా థియేటర్ కెళ్లి చూసే చిత్రంగా ఢి ఫర్ దోపిడిని మలచడంలో దర్శకుడు సిరాజ్ కల్లా కొంత తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఢి ఫర్ దోపిడిని నిర్మించిన రాజ్ నిడిమోరు & కృష్ణ డి కె నానీ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. చివర్లో నానీపై చేసిన షూట్ చేసిన సాంగ్, వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. -
ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను!
ప్రతిభ, అదృష్టం... ఈ రెండూ తోడైతే నాని. ప్రస్తుత పరిస్థితుల్లో గాడ్‌ఫాదర్ లేకుండా సినీరంగంలో ఎదగడం తేలికైన విషయం కాదు. కానీ, నాని ఎదిగి చూపించాడు. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా టర్న్ తీసుకొని, ఇప్పుడు నిర్మాత స్థాయికి చేరుకున్నాడు. ‘‘నేనింకా చేరుకోవాల్సిన విజయ తీరాలు చాలా ఉన్నాయి’’ అంటున్నారు నాని. సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె.లతో కలిసి నాని నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నానితో జరిపిన సంభాషణ. ఉన్నట్టుండి నిర్మాతగా మారారేంటి? వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశాను. ఆసక్తికరంగా అనిపించాయి. మొత్తం సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ టీమ్‌లో నేనూ ఒకణ్ణి ఎందుకు కాలేకపోయానా అనిపించింది. అనుకోకుండా ఈ సినిమా నిర్మాతలు నన్ను కూడా వారి టీమ్‌లోకి ఆహ్వానించారు. అలా నిర్మాతల్లో నేనూ ఒకణ్ణి అయిపోయాను. ఇక ముందు కూడా నిర్మాతగా కొనసాగుతారా? సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకూ జరిగే ప్రాసెస్ అంతా నాకు తెలుసు. అయితే... ఆ తర్వాత జరిగే ప్రాసెస్ నాకు తెలీదు. నిర్మాతగా మారాక, ఇప్పుడు తెలుస్తోంది. సినిమా పూర్తవ్వడం ఒక ఎత్తయితే... దాన్ని థియేటర్లకు పంపడం ఒక ఎత్తు అని. ఈ అనుభవం నిర్మాతగా కొనసాగడానికే ఉపయోగపడుతుందంటే నేనొప్పుకోను. నటుడికి కూడా అవసరమే. మరి మీ ‘పైసా’ సినిమా విడుదల విషయంలో కూడా ఇలాగే సహకరించొచ్చుగా? నేను ‘పైసా’ లాంటి సినిమాలో హీరోగా చేసే స్థాయికి ఎదిగానేమో కానీ, ‘పైసా’ లాంటి సినిమాను నిర్మించే స్థాయికి ఎదగలేదు. అది చాలా పెద్ద సినిమా. ఇంతకీ ‘పైసా’ విడుదల ఎప్పుడు? త్వరలోనే. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం మాత్రం ఖాయం. నేను కృష్ణవంశీగారి అభిమానిని. కానీ.. ‘పైసా’ నిర్మాణం టైమ్‌లో ఆయనతో చాలా విషయాల్లో వాదన పెట్టుకునేవాణ్ణి. అందులో కొన్ని సీన్స్, ఇందులో కొన్ని సీన్స్ తీసుకుని సినిమా తయారు చేస్తున్నారని ఏవేవో అనేశాను. కానీ.. సినిమా మొత్తం చూశాక తెలిసింది కృష్ణవంశీగారంటే ఏంటో. నేను నమ్మకంగా చెప్పేదొక్కటే. కృష్ణవంశీగారి కెరీర్లో ‘ఖడ్గం’ ఎంత గొప్ప సినిమానో, ఇదీ అంతటి గొప్ప సినిమా. మీ ద్వారా యశ్‌రాజ్ సంస్థ దక్షిణాదికి ప్రవేశించడం ఎలా ఉంది? ఈ సినిమాకు ‘ఆహా కళ్యాణం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పనిమీద ముంబయ్‌లోని యశ్‌రాజ్ స్టూడియోకి వెళ్లాను. అక్కడ వరుసగా మేకప్ రూమ్స్‌పై షారుఖ్ అనీ, సల్మాన్ అనీ, ఆమిర్ అనీ, దీపికా పదుకొనే అనీ... ఇలా ఆర్టిస్టుల పేర్లు రాసున్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్తుంటే చివర్లో ‘నాని’ అని నా పేరు రాసుంది. తమ సంస్థలో నటించిన హీరోల ఫొటోలను కూడా వారు వరుసగా అమర్చారు. వాటిలో నా ఫొటో కూడా ఉంది. ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘ఆహా కల్యాణం’ దర్శకుడు గోకుల్ తమిళుడవ్వడంతో ఈ సినిమాను తమిళంలోనే తెరకెక్కించారు. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం తెలుగులో రీషూట్ చేశారు. కానీ ఆర్టిస్టులు మాత్రం దాదాపుగా అందరూ కొత్తవారే. శేఖర్‌కమ్ముల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వాణీకపూర్ కథానాయిక. ‘బ్యాండ్ బాజా బారత్’ రీమేక్ కదా. మరి ఇందులో లిప్ లాక్‌లు ఉంటాయా? అంతా ఇప్పుడే చెప్పేస్తే ఎలా. ఆ సినిమా గురించి మాట్లాడే రోజులు ముందున్నాయి. లిప్ లాక్‌లు ఎన్ని ఉన్నాయి? అవి ఎంత సేపు ఉంటాయి? అవన్నీ అప్పుడు చెబుతా (నవ్వుతూ). కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా? మా అక్కయ్య యూఎస్‌లో ఉంటోంది. తన దగ్గరకు వెళ్లాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు. ఈసారి అక్కడే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటా. ఇరవై రోజుల్లో తిరిగొచ్చాక... అప్పుడు కొత్త సినిమాల గురించి ఆలోచిస్తా. మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా? ఎందుకు చేయను. కాకపోతే.. మల్టీస్టారర్స్ అంటే ఇక్కడ పాత్రల పరిధుల్నే చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పాత్రలు సమానంగా ఉండనక్కర్లేదు. ఓ పాత్ర తక్కువగా ఉన్నా... అది కథను ప్రభావితం చేసేలా ఉంటే చాలు, అదే గొప్ప మల్టీస్టారర్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతోంది అదే. పెద్ద పెద్ద హీరోలే అక్కడ అలా వచ్చి ఇలా మాయమయ్యే పాత్రలు చేస్తున్నారు. అలాంటి మంచి కథ దొరికితే... మల్టీస్టారర్ చేయడానికి నేను రెడీ. కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా. వైవాహిక జీవితం ఎలా ఉంది? పెళ్లి విషయంలో లేట్ చేయకుండా 27 ఏళ్లకే చేసేసుకున్నా. అందుకే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంది. పిల్లల్ని ఇప్పుడే వద్దనుకుంటున్నాం. దానికి కాస్త టైమ్ కావాలి. -
మూడు నిమిషాలు కనిపిస్తాను - నాని
‘‘ఈ ఏడాది నేను నటించిన ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఆ లోటుని ఈ సినిమా తీరుస్తుంది. ఎందుకంటే ఇందులో నేను మూడు నిమిషాలు కనిపిస్తాను’’ అని నాని చెప్పారు. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ హీరోలుగా సిరాజ్ కల్లా దర్వకత్వంలో, నాని సమర్పణలో, రాజ్ నిడిమోర్, కృష్ణ డీకే నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ ‘‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నలుగురు కుర్రాళ్లు బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇందులో వినోదాత్మకంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. రెండు గంటలు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇదని సందీప్‌కిషన్, వరుణ్‌సందేశ్ తెలిపారు. ఇది కొత్త పంథాలో ఉండే చిత్రమని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
‘డీ ఫర్ దోపిడి’ సినిమా స్టిల్స్
-
దోపిడి దొంగలు వచ్చేస్తున్నారు
ఈజీమనీ కోసం నలుగురు కుర్రాళ్లు.. దోపిడీకి ప్లాన్ చేస్తారు. మరి వారి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డి ఫర్ దోపిడి’. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్ ప్రధాన పాత్రధారులు. సిరాజ్ కల్లా దర్శకుడు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే, హీరో నాని నిర్మాతలు. ‘దిల్’ రాజు సమర్పణలో ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తిని కలిగించేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. దేవకట్టా ఐపీఎస్ అధికారిగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహేష్‌శంకర్, సచిన్, జిగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ శంకర్. -
నాని ప్రమోషనల్ సాంగ్
‘‘ ‘ఈగ’ సినిమా తర్వాత నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో నేనిచ్చిన వాయిస్ ఓవర్ తర్వాత వచ్చే సాంగ్ ఇది. మహేష్ శంకర్ చక్కటి సంగీతం అందించారు’’ అని నాని చెప్పారు. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలని ముఖ్యతారలుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న ‘డి ఫర్ దోపిడి’ కోసం నానిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడు దల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బాలీవుడ్లో మేం చేసిన ‘గో గోవా గాన్’ చిత్రానికి నృత్యదర్శకత్వం చేసిన ఆదిల్ షేక్ నేతృత్వంలో ఈ ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఒక్క రోజులో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశామ’’ని తెలిపారు. టైటిల్ సాంగ్‌నే ప్రమోషనల్ సాంగ్‌గా చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. నవంబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ‘దిల్’ రాజు తెలిపారు. -
'డి ఫర్ దోపిడీ'కి నాని వాయిస్ ఓవర్
జల్సా సినిమాకు ముందు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుంది కదూ.. ఇప్పుడు యువహీరో నాని కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. ముందే రేడియో జాకీగా చేసిన అనుభవం ఉండటంతో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఠకీమని ఒప్పేసుకున్నాడు. నిర్మాణదశలో ఉన్న 'డి ఫర్ దోపిడీ' చిత్రానికి నాని వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. చిత్ర నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె అంటే నానికి చాలా గౌరవమని, అందుకే వాళ్లు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడని సినిమాలో నటిస్తున్న సందీప్ కిషన్ తెలిపాడు. సిరాజ్ కల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, నవీన్, రాకేష్, మెలానీ కన్నొకడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో 'షోర్ ఇన్ ద సిటీ', 'గో గోవా గాన్' లాంటి చిత్రాలు నిర్మించిన రాజ్, డీకే సంయుక్తంగా 'డి ఫర్ దోపిడీ' తీస్తున్నారు. ఇది త్వరలోనే విడుదల కానుంది. నాని నటించిన పైసా, జెండాపై కపిరాజు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. 'బ్యాండ్ బాజా బరాత్' చిత్రం రీమేక్‌లో కూడా నాని నటిస్తున్న విషయం తెలిసిందే.