అమ్మాయిలంటే గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవాళ్లు కాదు. గోల్ కొట్టేవాళ్లు.. గోల్డ్ పట్టేవాళ్లు.. అమ్మాయిలు!నిజానికి.. నచ్చిన పని చెయ్యడమే.. గోల్డ్. రీమా కాగ్తీకి వెండితెర నచ్చింది. అక్కడే గోల్ కొట్టాలనుకుంది. ఇప్పుడు ‘గోల్డ్’మూవీ తీసింది! సిల్వర్ స్క్రీన్ వద్దన్నవాళ్లే ఇప్పుడు రీమాను ‘బంగారు తల్లి’ అంటున్నారు!
దాదాపు 38 ఏళ్ల కిందట.. అస్సాంలోని బొర్హప్జాన్ ప్రాంతం. ఏడేళ్ల అమ్మాయి అక్కడి థియేటర్‌లో ‘ది ఎక్సార్‌సిస్ట్’ అనే హారర్ సినిమా చూస్తోంది సీరియస్‌గా. స్క్రీన్ మీద సన్నివేశం చూస్తూ ఒక్కసారిగా అరుస్తూ ఆ చీకట్లో వాళ్లమ్మ కోసం వెదుక్కుంటోంది. ఏమీ కనిపించక అయోమయంగా కేకలేస్తూ పరిగెట్టబోతుంటే వాళ్లమ్మ ఆ పిల్ల చెయ్యి పట్టుకొని థియేటర్ బయటకు లాక్కొచ్చేసింది. ‘‘ఇంకోసారి ఇలాంటి సినిమాలకు వచ్చావంటే చంపేస్తా’’ బెదిరించింది. ఆ టైమ్‌లో ‘రాను’ అన్నట్టుగా బిక్కమొహాన్ని అడ్డంగా ఊపింది కాని సినిమాలు చూస్తూనే ఉంది.
‘ఈ బతుకూ ఒక బతుకేనా?’
ఆ అమ్మాయికి పదేళ్లు వచ్చేసరికి బోర్డింగ్ స్కూల్లో ఉంది. ప్రతి ఆదివారం సాయంకాలాలు అక్కడి ఫిల్మ్‌క్లబ్‌లో పెద్దవాళ్లకు మాత్రమే అనుమతి ఉండేది. కాని రీమా కూడా వెళ్లేది. ఒకసారి అమితాబ్ బచ్చన్ నటించిన మిస్టర్ నట్వర్‌లాల్ సినిమా చూస్తోంది. అందులో అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఉంటుంది.. ‘‘యే జీనా భీ కోయీ జీనా హై లల్లూ?’’ (ఈ బతుకూ ఒక బతుకేనా లల్లూ) అని. ఆ క్షణాన డిసైడ్ చేసుకుంది ఆ పిల్ల ఫిల్మ్ మేకర్ కావాలని. ఆమెకు 24 ఏళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులతో చెప్పింది.. సినిమా డైరెక్టర్ అవడానికి ముంబై వెళ్తానని. పక్కలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డారు. చెప్పినా వినదని ఓకే అన్నారు. ఆనక ఆ అమ్మాయి తండ్రి తన తండ్రిని తిట్టుకున్నాడు.. ‘‘దీనికి ఈ బుద్ధి మా నాన్ననుంచే వచ్చింది’’ అని. ఆ అమ్మాయి తాత బిజినెస్‌మనే కాని సినిమాలంటే చాలా షోకు. కొన్ని అస్సామీస్ సినిమాల్లో నటించడంతోపాటు ఇంకొన్నిటిని నిర్మించాడు కూడా. సినిమా అభిరుచి విషయంలో అలా తాత జీన్స్‌ను పంచుకుందన్నమాట. ఈ ఫ్లాష్‌బ్యాక్‌ను ఇక్కడ కట్ చేసి..
.. ప్రెజెంట్‌లోకి వద్దాం
‘గోల్డ్’ సినిమా తెలుసు కదా.. ఈనెల (ఆగస్ట్) పదిహేనున విడుదల అవుతోంది. ట్రైలర్స్ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ‘గోల్డ్’ స్క్రీన్ ప్లేలో చుట్టూ చాలా విశేషాలే ఉన్నాయి. ఆ ఫ్లాష్‌బ్యాక్ డ్రామాను ఈ మూవీ ట్విస్ట్‌తో కలుపుదామిప్పుడు. సినిమాలంటూ ముంబై వెళ్లిన ఆ అమ్మాయే ఈ ‘గోల్డ్’ డైరెక్టర్. యెస్... రీమా కాగ్తీ.
గోల్డ్’ సినిమా వెనుక స్టోరీ
రీమా కాగ్తీకి ఎప్పటి నుంచో స్పోర్ట్స్ మూవీ చేయాలని ఆశ. ఇదే మాటను రీమా స్నేహితుడైన రచయిత, దర్శకుడు, సంగీతదర్శకుడు అంకుర్ తివారీతో చెప్పింది. ‘‘అయితే ఇండియా ఫస్ట్ గోల్డ్ మెడల్ మీద దృష్టిపెట్టొచ్చు కదా’’ అని ఐడియా ఇచ్చాడు. రీమా, రాకేశ్ దేవరాజ్ (గోల్డ్ సినిమా సహ రచయిత) ఇద్దరికీ ఆ ఆలోచన నచ్చింది. దాని మీద పరిశోధన కూడా మొదలుపెట్టారు. ఆ బంగారు చరిత్ర చదవడం మొదలుపెట్టిన రీమాకు మన జాతీయ క్రీడ హాకీలో 1948లో స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సంపాదించిన విషయం, అసలు ఆ ఆటను బ్రిటిషర్స్ ఇండియాకు తెచ్చిన వైనం, తర్వాత ఆ ఆటలో మన వాళ్లు ఆరితేరిన విధం, చివరకు మన జట్టే అత్యంత మెరుగైన జట్టుగా నిలబడ్డ తీరూ, హాకీ మన క్రీడా సంపదగా వెలుగొందిన యుగం.. అన్నీ సవివరంగా తెలిశాయి.
ఈ కథకు ప్రేరణ ఆ మేనేజరే
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద బ్రిటిష్ నిషేధం విధించిన సమయంలో ఓ యువ భారతీయుడు.. మైదానంలో బ్రిటిషర్స్ అందరూ చూస్తూ ఉండగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండాను ఎత్తిపట్టుకుంటే ఇండియన్ హాకీ ఆటగాళ్లంతా ఆ జెండాకు సెల్యూట్ చేసిన అంశం కూడా తన పరిశోధనలో రీమా కంటపడ్డది. అతని గురించి మరిన్ని వివరాల కోసం ఇండియన్ స్పోర్ట్ హిస్టరీని శోధించసాగిస్తే అతనే తర్వాత.. అంటే 1948లో మన హాకీ టీమ్‌కు మేనేజర్ అయ్యాడని తెలిసింది. అతను బెంగాలీ. ఇంత చరిత్రను హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ వరకే, లేదంటే గోల్డ్‌మెడల్ తెచ్చుకున్న అంశానికే పరిమితం చేస్తే సినిమాను అసంపూర్తిగా ఎండ్ చేయాల్సి వస్తుందని భావించింది రీమా. అందుకే 1936 నుంచి 48 వరకు గల పరిణామాలను, ఆ పన్నెండేళ్ల ప్రయాణం మీద ఫోకస్ చేయాలనుకుని గోల్డ్‌ను రూపొందించింది. ఈ కథకు ప్రేరణ ఆ మేనేజరే. ఆ కాలంలో జరిగిన నిజమైన సంఘటనను ఆధారంగా చేసుకుని కొంత సినిమాటిక్ (ఫిక్షనల్)గా మలిచింది. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే మన క్రీడా దిగ్గజాలకు ఇస్తున్న రెస్పెక్ట్, చేస్తున్న సెల్యూటే ‘గోల్డ్’ అంటుంది రీమా. ఇందులో అక్షయ్ కుమార్‌ది ప్రధాన భూమిక. ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ కూడా మహిళే.. నందిని శ్రీకాంత్. ప్రొడక్షన్ డిజైన్‌లో ఓ మహిళ ఉంది.. శైలజా శర్మ. సెట్‌ను డెకోరేట్ చేసిందీ ఆడవాళ్లే... నికితా జైన్, యాస్మిన్ సేథి. కాస్ట్యూమ్స్ కూడా అమ్మాయే.. పాయల్ సలూజా. ప్రొడక్షన్ కోఆర్డినేటర్లు... సురభి భట్నాగర్, ఇషితా గాలా, బార్బరా మారియా.. విమెనే. ఇవీ గోల్డ్ మూవీ విశేషాలు.
బ్యాక్ టు రీమా కాగ్తీ.. బోడో మిలిటెంట్
ముంబై చేరిన రీమా ఫిల్మ్‌ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టింది. రతజ్ కపూర్ తీసిన ‘ప్రైవేట్ డిటెక్టివ్’ ఆమెకు దొరికిన ఫస్ట్ చాన్స్. ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు కాని దర్శకత్వ మెళకువలు మాత్రం నేర్పింది. తర్వాత మూడేళ్లకు హానీ ఇరానీ ‘అర్మాన్’ పిక్చర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని దొరికింది. ఇందులో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్. చిన్నప్పుడు ఆయన సినిమాను చూసే ఫిల్మ్‌మేకర్ కావాలనుకుంది కనుక కలలు నిజమైనట్టే సంబరపడింది. ఆయన ప్రొఫెషనలిజం చూసి భయపడేదట. ఆమె భయాన్ని పోగొట్టడానికి అమితాబ్ రీమాను ‘‘హేయ్.. బోడో మిలిటెంట్’’ అంటూ పలకరించేవాడట. ఈ షూటింగ్‌లోనే రీమాను చూసి ప్రొడక్షన్ మేనేజర్ ‘‘డైరెక్షన్ మీ ఆడవాళ్ల పనికాదు. మీకు చేతకాదు. చేతనైనా పని ఇంకేదైనా చూసుకో’’ అని సలహాలివ్వడం మొదలుపెట్టాడు. ‘‘ఆ మాట తలచుకుంటే ఇప్పటికీ రక్తం మరుగుతుంది. ఆడవాళ్లంటే ఎంత చులకన. ఇలాంటి వాళ్లందరికీ బుద్ధి చెప్పింది ఫర్హా ఖాన్’’ అని గుర్తు చేసుకుంటుంది రీమా.
‘నా స్ట్రగుల్ జెండర్‌తో కాదు’
‘‘కచ్చితంగా ఇది మేల్‌డామినేటెడ్ ఇండస్ట్రీయే. కాని నా కళ్లముందే చాలా మారింది. ఆడవాళ్ల వల్ల ఏమవుతుంది అన్నవాళ్లే ఈ రోజు కామ్ అయిపోయిన పరిస్థితి. టెక్నీషియన్స్‌గా చాలామంది అమ్మాయిలు వచ్చారు. చివరికి లైట్ అసిస్టెంట్స్‌గా కూడా. తలాష్ సినిమా రావడానికి నేను కేవలం ఫైవ్ ఇయర్సే వెయిట్ చేశాను. అయితే ఆడవాళ్లు డైరెక్టర్ అయ్యాక ‘ఆ.. వాళ్లేం చేస్తారు.. ఫెమినిజం బేస్డ్ సినిమాలు తప్ప’ అని అన్నవాళ్లూ ఉన్నారు. స్క్రిప్ట్ వినిపించబోతే ఆడవాళ్ల సబెక్టా అని వెటకారం ఆడిన వాళ్లు, ఆ సబ్జెక్ట్‌లతోనే సినిమాలు తీయమని అడిగిన వాళ్లూ ఉన్నారు. అందుకే ఇక్కడ నా స్ట్రగుల్ జెండర్‌తో కాదు.. నా థీమ్స్‌తో. మేమూ ఆల్టర్‌నేటివ్, హట్కే, కమర్షియల్ సినిమాలు తీయగలం. జోయా, ఫర్హా... ఎంతమంది లేరు?’’ అంటోంది రీమా కాగ్తి.
జోయా పరిచయం ఓ మలుపు
జోయా అఖ్తర్ పరిచయం రీమా సినిమాను మార్చేసింది. కైజాద్ గుస్తాద్ తీసిన ‘బాంబే బాయ్స్’తో జోయా ఫ్రెండ్ అయింది రీమాకు. జోయా ద్వారానే ఫర్హాన్ అఖ్తర్‌ను కలిసింది. ఆయన వల్లే ఎక్సెల్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పనిచేసే అవకాశం కలిగింది. అలా లక్ష్య, జిందగీ న మిలేగి దొబారా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్ట్‌గా టైటిల్స్ కార్డ్స్‌లో ప్లేస్ అయింది. ఆమె పనితీరు, వేగం.. కీన్ అబ్జర్వేషన్.. గమనించి ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’కి డైరెక్టర్‌గా వర్క్ ఇచ్చారు. అదే రీమా తొలి చిత్రం. తర్వాత ‘తలాష్’ సినిమానూ చేసి చూపించింది. క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. సినిమాల్లోకి వెళ్లడాన్ని అంతగా ఇష్టపడని పేరెంట్స్‌కి తలాష్ సినిమాతో రీమా పని అర్థమైంది. ఆడియెన్స్ అందరి లాగే ఆ సినిమాను థియేటర్‌లో చూసి చాలా థ్రిల్ ఫీలయ్యారట ఆమె కుటుంబీకులు. ఆడియెన్స్ రియాక్షన్స్‌ను కూడా ఎప్పటికప్పుడు మెస్సేజ్ చేశారట.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment