యూకే నుంచి టన్నులకొద్దీ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారత్‌కు తీసుకొచ్చింది. 1991 తరువాత మొదటిసారిగా యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని దేశంలోని తన వాల్ట్‌లకు తరలించింది.
ఆర్బీఐ బంగారు నిల్వలలో సగానికి పైగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద సురక్షితమైన కస్టడీలో ఉన్నాయి. మూడింట ఒక వంతు బంగారాన్ని మాత్రం దేశీయంగా నిల్వ చేస్తారు. బంగారం తరలింపునకు ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లించే నిల్వ ఖర్చులు ఆదా కానున్నాయి.
ఆర్బీఐ వార్షిక గణాంకాల ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా 822.10 టన్నుల బంగారం కేంద్ర బ్యాంక్ వద్ద ఉంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 794.63 టన్నులతో పోలిస్తే ఇది అధికం.
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి 1991 జూలైలో ఆర్బీఐ 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వద్ద తాకట్టు పెట్టి 400 మిలియన్ డాలర్లను సమీకరించింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆర్బీఐ 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
2009లో ప్రభుత్వం తన ఆస్తులను వైవిధ్యపరచడానికి 6.7 బిలియన్ డాలర్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్బీఐ కొనుగోళ్ల ద్వారా బంగారం నిల్వలను స్థిరంగా పెంచుకుంటూ వస్తోంది.
దేశ మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 2023 డిసెంబర్ చివరి నాటికి 7.75 శాతం నుంచి 2024 ఏప్రిల్ చివరి నాటికి 8.7 శాతానికి పెరిగింది. ముంబైలోని మింట్ రోడ్, నాగపూర్‌లోని ఆర్బీఐ భవనం వాల్ట్‌లలో బంగారం నిల్వలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment