గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం ముగిసిందని... ప్రస్తుతం తనకు క్యాన్సర్ నయమైందని అంటున్నారు బాలీవుడ్ నటుడు రిషి కపూర్. డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాను. అమెరికాలో ఈ నెల 1 నుంచి మరో చికిత్స ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేవుడు నా మీద దయ చూపాడు. ఇక నాకు ఏ చికిత్స అవసరం లేదన్నారు వైద్యులు. అంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. బోన్ మ్యారో చికిత్స ఒక్కటి మిగిలి ఉన్నది. దానికి మరో 2 నెలల పడుతుందన్నారు వైద్యులు. అది పూర్తయ్యాక ముంబయికి తిరిగి వస్తాను’ అని రిషి కపూర్ తెలిపారు.
అంతేకాక ‘నేను ఇంత త్వరగా కోలుకున్నానంటే అందుకు కారణం నా కుటుంబం, నా అభిమానులు ప్రేమ, దేవుడి దయ. ముఖ్యంగా నా భార్య నీతు. తను లేకపోతే నేను న్యూయార్క్ వెళ్లి చికిత్స చేయించుకునేవాడిని కాను. నా పిల్లలు రణ్‌బీర్, రిధిమా కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నా గురించి ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. సాధరణంగా నాకు ఓపిక చాలా తక్కువ. అలాంటిది ఓపిగ్గా ఎలా ఉండాలో నాకు దేవుడు ఈ రకంగా తెలియజేశాడు’ అని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళుతున్నానని ట్విట్ చేశారు రిషి కపూర్. త్వరలోనే ముంబయికి తిరిగివస్తానని, అంతవరకు తన అనారోగ్యం గురించి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని కోరారు. అయితే తనకు వచ్చిన అనారోగ్య సమస్యను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం చికిత్స దాదాపు పూర్తికావొస్తున్న నేపథ్యంలో తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తాజాగా మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాను కోలుకున్నానని వెల్లడించారు రిషి కపూర్. చివరిగా ‘ముల్క్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషి కపూర్.
Comments
Please login to add a commentAdd a comment