
ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో డిఫరెంట్ ప్రమోషన్‌తో ఆసక్తి కలిగిస్తున్న సినిమా ఆర్‌ఎక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 12న రిలీజ్ అవుతోంది.రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను కేసీడబ్ల్యూ బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి నిర్మించారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు.. కబాలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కే ఎల్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర హీరో కార్తీకేయ మీడియాతో మాట్లాడుతూ.. `ఆర్‌ఎక్స్ 100 ప్రయాణం అంతా ఈజీగా జరగలేదు.. ఎన్నోకష్టనష్టాలకోర్చి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసువస్తున్నాం. ఈ సినిమా రొటీన్ ప్రేమకథ కాదు. విభిన్న కథా కథనాలతో సహజంగా ఉండేలా సినిమాను తెరకెక్కించాం. అందుకే ఇంక్రిడబుల్ లవ్ స్టోరి అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాం. సినిమా ఆ ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఉంటుంది. తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నా, పూర్తి స్థాయిలో కొత్తదనం చూపించటం లేదన్న భావన ఉంది. అయితే ఆర్ ఎక్స్ 100 ప్రేక్షకులకు పూర్తిగా కొత్త ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది.
సినిమాలో నా క్యారెక్టర్‌లో రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కొంత భాగం క్యూట్ ఇన్నోసెంట్ అబ్బాయిగా కనిపిస్తాడు హీరో, తరువాత చూస్తేనే భయపడేంత రాక్షసుడిగా సైకోలా మారిపోతాడు. ఈ రెండు వేరియేషన్స్ చూపించేందుకు చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నించాను జనం ఎలా ఆదరిస్తారో చూడాలి. హీరోగా పరిచయం అయ్యేందుకు ఇలాంటి కథ కోసమే ఎదురుచూశాను. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కొత్తగా ప్రయత్నించాడన్న పేరు వస్తుందని నమ్ముతున్నా. ప్రస్తుతం ఆఫర్స్ వస్తున్నాయి.. కానీ సినిమా రిలీజ్ అయ్యాకే మరో ప్రాజెక్ట్ ను ఓకె చేయకూడాదని వెయిట్ చేస్తున్నా` అన్నారు.
ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్‌ఎక్స్ 100 సినిమాను భారీ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా ఓవర్‌సీస్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని, శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల స్థాయిలో దాదాపు 100 స్క్రీన్స్ లో ఆర్ ఎక్స్ 100 ప్రేక్షకుల ముందుకు రానుంది.