శీను స్టెప్పులు కేక..!
అన్నం ఉడికిందో, లేదో ఒక్క మెతుకు చెప్పేస్తుంది. అలాగే.. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఏంటో.. సినిమా కంటే ముందే ప్రచార చిత్రాలు చెప్పేస్తున్నాయి. ముఖ్యంగా నృత్యాల్లో శ్రీనివాస్ కనబరుస్తున్న ఈజ్‌కి ప్రశంసల వర్షమే కురుస్తోందంటే అతిశయోక్తి కాదు. ఓ స్టార్‌తో సినిమా చేస్తే తానెలా ఖర్చుపెడతారో అంతకంటే భారీగా, కోటి ఆశలతో కోట్లు ఖర్చుపెట్టి బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఎలాగైనా తన తనయుడ్ని తెలుగు చిత్రసీమలోని స్టార్లలో ఒకడిగా నిలబెట్టడమే ప్రస్తుతం ఆయన ధ్యేయం. ఈ సినిమాకు దర్శకునిగా వి.వి.వినాయక్‌ని ఎంచుకోవడంలో కారణం కూడా అదే. తనను దర్శకునిగా నిలబెట్టిన బెల్లకొండ సురేశ్ రుణాన్ని తీర్చుకోవడానికి వినాయక్‌కి దక్కిన గొప్ప అవకాశం ‘అల్లుడు శీను’. అందుకే... ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారాయన. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దేవిశ్రీప్రసాద్ స్వరాలు ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేశాయి.
ఇంత మంచి ఆడియో ఇచ్చిన దేవిశ్రీకి, నా కుమారుడు శ్రీనివాస్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్న వినాయక్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’’ అన్నారు. విడుదల రోజు నుంచే అమ్మకాల పరంగా పాటలు సంచలనం సృష్టిస్తున్నాయని ఆదిత్య ప్రతినిధులు చెప్పారు. ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, బాబీ, కెమెరా: చోట కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, నిర్మాత: బెల్లంకొండ గణేశ్‌బాబు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.