పెద్ద నిర్మాత కొడుకుగా కాదు...తన ప్రతిభతో సాయి నిలబడతాడు
‘‘నాకు బాగా నచ్చితేనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాను. లేకపోతే వీలైనంత దూరంగా ఉంటాను. ఈ సినిమా బాగా నచ్చడంవల్ల నా అంతట నేనుగా బెల్లంకొండ సురేశ్‌కి ఫోన్ చేసి, ప్రెస్‌మీట్ పెట్టమన్నాను’’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తన కుమారుడు సాయి శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేశ్ సమర్పిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’. బెల్లంకొండ గణేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీనివాస్‌కి మామగా నటించిన ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘వినాయక్‌తో ‘దిల్’ సినిమా నుంచి నా ప్రయాణం సాగుతోంది. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
ఈ చిత్రకథను తను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇలాంటి కథతో సినిమా తీయాలంటే ఏ దర్శకునికైనా దిల్లుండాలి. అసలీ సినిమాని అతను ఎలా తీస్తాడా? అనుకుంటూ వచ్చాను. తీస్తున్న సమయంలో కూడా సినిమా ఇలా ఉంటుంది అని ఊహకందలేదు. కానీ, డబ్బింగ్ చెబుతున్నప్పుడు వినాయక్ చేసిన మేజిక్ అర్థమైంది. ఇందులో నాతో రెండు విభిన్న పాత్రలు చేయించాడు. దక్షిణ, ఉత్తరాది భాషల్లో కలిపి 300 చిత్రాలు చేసిన నాకు ఈ సినిమా ఓ అద్భుతంలా అనిపించింది. ఓ కొత్త కథతో కమర్షియల్ ఫార్మట్‌లో సాగే చిత్రం ఇది’’ అన్నారు. చిత్రకథానాయకుడు సాయి శ్రీనివాస్ గురించి చెబుతూ - ‘‘మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన తొలి చిత్రాల్లో నేనే యాక్ట్ చేశాను.
తొలి సినిమాకే అద్భుతంగా మౌల్డ్ అయిన తక్కువమంది హీరోల్లో సాయి ఒకడు. డాన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నీ బాగా చేశాడు. ఓ పెద్ద నిర్మాత కొడుకు అని కాకుండా తన ప్రతిభతో సాయి నిలబడతాడు’’ అని చెప్పారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో మామ పాత్రను ప్రకాశ్‌రాజ్ చేస్తేనే బాగుంటుందని ఆయనకోసం మూడు నెలలు వెయిట్ చేశాం. ప్రకాశ్‌రాజ్ వంటి నటుడి కళ్లల్లోకి చూస్తూ కొత్త నటులు నటించడం అంత సులువు కాదు. కానీ, సాయి ఎలాంటి బెరుకు లేకుండా చాలా కంఫర్టబుల్‌గా యాక్ట్ చేశాడు. ఓ పది సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా చేశాడు. అద్భుతమైన కామెడీ, తండ్రీ, కూతురి సెంటిమెంట్, మంచి యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సాగే చిత్రం ఇది. నాకు, సాయికి ‘ఆది’ స్థాయి సినిమా కావాలనే ఆశ ఉంది’’ అన్నారు.