సినీ ప్రియుల ‘సుల్తాన్’
సామాన్యుడు విజేతవడం మామూలు సినిమా. విజే తగా మారి, ఆ విజయం మత్తులో జీవి తంలో పరాజితు డైతే? జీవితమనే గోదాలోకి దిగి, తనతో తాను, తనలో తాను పోటీపడితే ఏమవుతుంది? సల్మాన్ హీరోగా చేసిన ఆ మ్యాజిక్
- ‘సుల్తాన్’
కథ ఏమిటంటే...
కుస్తీ, కరాటే, బాక్సింగ్ వగైరా మార్షల్ ఆర్ట్స్ అన్నిటి కలగలుపుగా గోదాలో ప్రత్యర్థుల మధ్య జరిగే పోటీ - మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్. ఈ పోటీకి దేశవాళీ టచ్ ఇస్తే అప్పుల ఊబిలో నుంచి బయటకొస్తామనీ, ఒకప్పటి ఫేమస్ భారతీయ మల్లయోధుడు ‘సుల్తాన్’ను బరిలోకి దింపితే బాగుంటుందనీ నిర్వాహకులు భావిస్తారు. హర్యానాలోని పల్లెటూళ్లో కుస్తీ పోటీలకు దూరంగా బతుకుతుంటాడు సుల్తాన్ (సల్మాన్‌ఖాన్). ఒకప్పుడు ఒలింపిక్ స్వర్ణపతక విజేతైన అతనెందుకు అలా అయ్యాడన్నది అసలు కథ.
సల్మాన్ భుజస్కంధాలపై...
ఈ సినిమాకు ప్రాణం, ప్రణవం - సల్మానే! ఊళ్లో డిష్ టీవీ యాంటెన్నాలు బిగించుకొనే భోళా మనిషిగా, హీరోయిన్ ప్రేమ కోసం... మల్లయోధురాలైన ఆమె కళ్ళల్లో గౌరవం కోసం కుస్తీపట్లు నేర్చుకొనే కార్య సాధకుడిగా, కుస్తీ పోటీలే జీవితమై - గర్వం తలకెక్కిన ఒలింపిక్ గోల్డ్ విజేతగా, జీవితంలో కావాల్సినవి కోల్పోయిన పరాజితు డిగా, తనతో తాను... తనతో తాను పోరాడే నిజమైన పహిల్వాన్‌గా - స్క్రిప్ట్‌లో ఒక్కో దశలో ఒక్కో కోణంలో ఉన్న సుల్తాన్ పాత్రను సల్మాన్ సమర్థంగా పోషించారు. ఈ సినిమా బరువునంతా, పెంచుకున్న కండలు తిరిగిన దేహం సాక్షిగా తన భుజాలపై మోశారు. మల్లయోధురాలిగా, ఆశయానికీ, ప్రేమకీ మధ్య నలిగే వ్యక్తిగా అనుష్క శర్మ బాగున్నారు.
నచ్చే అంశాలు... మెచ్చాల్సిన విషయాలు...:
గ్రామసీమల్ని అందంగా చూపిన ఛాయాగ్రహణం, అనుభూతినిచ్చే సినిమా రీరికార్డింగ్ లాంటి ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విభాగాలన్నీ బాగున్నాయి. కథ ఎటు వెళుతుందన్నది ముందే తెలిసిపోతున్నా, గోదాలో హీరోకూ, ప్రత్యర్థులకూ మధ్య పోటీ జరిగినప్పుడల్లా ప్రేక్షకులు కుర్చీలకి అతుక్కుపోతారు. ‘ఊపర్ అల్లా... నీచే ధర్తీ...’ అంటూ పదే పదే వచ్చే గీతఖండిక ఎమోషన్‌ను చాలా సార్లు పెంచింది. పురిట్లో బిడ్డ ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా సమానమే లాంటి అభ్యుదయ అంశాల్ని నైసుగా సిన్మాలో చెప్పించారు. కథ పకడ్బం దీగా రాసుకొని, ఎడిటింగ్‌కు పని పెడితే, ‘సుల్తాన్’ వేరే రేంజ్‌లో ఉండేది.
- రెంటాల జయదేవ